Disha Patani : దిశా పటానీ ఇంటిముందు కాల్పుల ఘటన నిందితుల హతం

దిశా పటానీ ఇంటిముందు కాల్పుల ఘటన నిందితుల హతం

Disha Patani : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో బాలీవుడ్‌ నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు ఇటీవల కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్‌ కౌంటర్‌లో హతమయ్యారు. దిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.

Disha Patani Attack Case

గాజియాబాద్‌ లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, దిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్‌లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్‌ ముఠా సభ్యులని చెప్పారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్దమొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా (Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఇటీవల కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.

గ్యాంగ్‌ స్టర్ చోటారాజన్ బెయిలు రద్దు చేసిన సుప్రీం కోర్టు

గ్యాంగ్‌స్టర్ చోటారాజన్‌ కు 2001 జయశెట్టి హత్య కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పు చెప్పింది. హోటల్ వ్యాపారి జయశెట్టి హత్యకు సంబంధించిన కేసులో గత ఏడాది మేలో ప్రత్యేక కోర్టు చోటా రాజన్‌ను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును ముంబై హైకోర్టులో చోటారాజన్ సవాలు చేశారు. 2024 అక్టోబర్ 23న ముంబై హైకోర్టు చోటారాజన్‌ విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ‘చోటారాజన్ నాలుగు కేసుల్లో దోషిగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి విధించిన జైలుశిక్షను ఏ విధంగా రద్దు చేస్తారు?’ అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసింది.

డిఫెన్స్ వాదనలను తోసిపుచ్చిన సుప్రీం

చోటారాజన్‌పై ఉన్న 71 కేసుల్లో 47 కేసుల్లో సీబీఐ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని రాజన్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆయన వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇతర కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైదు పడినందున తిరిగి అతను లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

హత్యకు ముందు బెదిరింపులు

ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, దక్షిణ ముంబైలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయశెట్టికి చోటారాజన్ ముఠా నుంచి బలవంతపు వసూళ్ల బెదిరింపులు వచ్చాయి. శెట్టికి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ అతని హత్యకు రెండు నెలల ముందు భద్రతను ఉపసంహరించారు. రూ.50,000 ఇవ్వాలన్న చోటారాజన్ గ్యాంగ్ డిమాండ్‌ను కాదన్నందుకు 2001 మే 4న జయశెట్టిని అతని కార్యాలయం వెలుపల ఇద్దరు ముఠా సభ్యులు కాల్చిచంపారు. 2024 మేలో ముంబైలోని ప్రత్యేక ఎంసీఓసీఏ కోర్టు చోటారాజన్‌కు జీవిత ఖైదు, రూ.1,00,000 జరిమానా విధించింది.

Also Read : Election Commission: ఈవీఎంల బ్యాలెట్ పేపర్లపై కలర్ ఫోటో

Leave A Reply

Your Email Id will not be published!