కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెర పడింది. మొత్తం 224 సీట్లకు గాను 132కి పైగా సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 63 సీట్లకు పరిమితమైంది. ఇక కింగ్ మేకర్ గా కావాలని భావిస్తూ వచ్చిన జనతాదళ్ సెక్యూలర్ పార్టీకి ఊహించని రీతిలో షాక్ తగిలింది. కుమార స్వామి ఆశలపై నీళ్లు చల్లారు ప్రజలు.
బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా ఆశించిన సీట్లు రాలేదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బీజేపీ, జేడీఎస్ కు బిగ్ షాక్ తగిలింది.
ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీని అడ్డుకోవడంలో కీలకమైన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్. ఒక రకంగా ఆయనే ట్రబుల్ షూటర్, రియల్ టార్చ్ బేరర్ గా మారి పోయారు. ఆ పార్టీ విజయ పథంలోకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆ మేరకు డీకే శివకుమార్ పార్టీకి జీవం పోశారు.
హైకమాండ్ పరంగా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. డీకేఎస్ తో పాటు మాజీ సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని సోదాలు, దాడులు చేపట్టినా చివరకు తట్టుకుని నిలబడేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. చివరకు ప్రజలు హస్తానికి జై కొట్టారు.