Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !
థాయ్‌లాండ్, మయన్మార్ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !
Earthquake : థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 11.50 గం.లకు సంభవించిన తొలి భూకంపం(Earthquake) కేంద్రం మయన్మార్ లోని సాగాయింగ్ పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది. మధ్యాహ్నం 12.02లకు వచ్చిన రెండో భూకంపం కేంద్రం కయక్స్ పట్టణానికి 20 కి.మీ.దూరంలో ఉంది. భూ ఉపరితలానికి 10.కి.మీ లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో థాయ్‌లాండ్, మయన్మార్(Mayanmar) లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ భూకంపం ప్రమాదానికి సంబందించి పలు చోట్ల రికార్డైన సీసీటీవి దృశ్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్థుల భవనం… సెకన్ల వ్యవధిలో పేకమేడలా కూలిపోయింది. భూకంపం తీవ్రతకు చాలా చోట్ల బహుళ అంతస్థుల బిల్డింగ్స్ లో పైన ఉన్న వాటర్ ట్యాంక్స్, స్విమ్మింగ్ ఫూల్స్ నుండి వాటర్ క్రిందకి పడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం థాయ్‌లాండ్(Thailand), మయన్మార్ రెండు దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు, డ్యామ్, ఆసుపత్రి, ఎయిర్ పోర్టు టెర్మినల్ వంటి అనేక భవనాలు కుప్పకూలాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్ లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. రెండు భూకంపాల కేంద్ర స్థానాలూ ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి.
Earthquake – ఒళ్ళుగగుర్పాటుకు గురిచేస్తున్న థాయ్ లాండ్ భూకంపం దృశ్యాలు
థాయ్‌లాండ్(Thailand) రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలి పోయింది. విపత్తు సమయంలో 320 మంది అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. మరో భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న ఈత కొలనులోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైరన్ల మోతతో బహుళ అంతస్తుల భవనాలను వీడి ప్రజలు ప్రాణ భయంతో రోడ్లపైకి పరుగులు తీస్తూ వస్తోన్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్‌లో మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. రెండో సారి ప్రకంపనలకు మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. థాయ్‌లాండ్‌లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో ఉద్యోగులు, ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో ప్రజలు వీధుల్లోనే ఉన్నారు. బ్యాంకాక్ నగరంలో వివిధ భవనాలు కూలిన ఘటనల్లో 10 మంది కార్మికులు మృతి చెందగా 101 మంది గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు. రెండు దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి.
మయన్మార్ లో మృత్యుకూపంగా మారిన మాండలే నగరం
వరుస భూకంపాల వల్ల మయన్మార్ లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో కనీసంగా 144 మంది చనిపోయారు. 730 మంది గాయపడ్డారు. పలు భవనాలు, ఆలయాలు, గోపురాలు, 90 ఏళ్ల నాటి వంతెన, ఒక డ్యామ్ కుప్పకూలాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో ఇటీవలే నిర్మించిన వెయ్యి పడకల ఆస్పత్రి ధ్వంసమయ్యింది. పలు రహదారులు బీటలువారాయి. మయన్మార్‌లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం అర్థించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ స్పందిస్తూ… తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్యుద్ధంలో తలమునకలైన మయన్మార్ లో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టాల తీవ్రత పెరగవచ్చని భావిస్తున్నారు.
ఇది భయంకరమైన భూకంపం శాస్త్రవేత్తలు
మయన్మార్(Mayanmar) లో వచ్చిన భూకంపం అత్యంత శక్తిమంతమైందని అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఇటువంటిదే తుర్కియే, సిరియాలో సంభవించడంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. మయన్మార్, థాయ్‌లాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు. రెండేళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియే, సిరియాలో భూకంపం సంభవించడంతో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా ఇక్కడ కూడా భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ పేర్కొంది.
భూకంప బాధిత దేశాలకు భారత్ ఆపన్నహస్తం
భారీ భూకంపాలతో అతలాకుతలమైన మయన్మార్(Mayanmar) కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. భారత వాయు సేనకు చెందిన C130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని మోదీ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ద్వారా తెలిపారు. సహాయక చర్యలకు అండగా నిలుస్తామన్నారు. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్‌లలో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది.
Also Read : Elon Musk: ‘ఎక్స్’ను విక్రయించిన ఎలాన్ మస్క్