Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్

కాగా,ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ కాలపరమితి ఫిబ్రవరి 23వ తేదీతో ముగియనుంది...

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్(EC) మంగళవారంనాడు ప్రకటించింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలిపింది. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయని పేర్కొంది. ఢిల్లీ(Delhi)లోని విజ్ఞాన్ భవన్‌ ప్లీనరీ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ వివరాలను వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరి 17వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Delhi Assembly Elections Schedule

ఢిల్లీలో1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని, ఐదోసారి ఓటింగ్‌లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారని చెప్పారు. 25.89 లక్షల మంది యువ ఓటర్లు (20-29) ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీలో13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్దిష్ట గ్రూపులను టార్గెట్ చేసుకుని ఓటర్ల జాబితాలో వారి పేర్లు తొలగించడం, కొందరి పేర్లు చేర్చడం జరిగిందని కొందరు (రాజకీయ పార్టీలు) చేస్తున్న దుష్ప్రచారాన్ని రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. ఈవీఎంల గురించి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఈవీఎంల అవకతవకలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈవీఎంలలో వైరస్, బగ్‌ కానీ, చెల్లని ఓట్లు కానీ ఉండవని, రిగ్గింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్‌లో ఎన్నికల సంఘం(EC) కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటడం దేశంలో మహిళా సాధికారతను బలంగా చాటుతోందన్నారు.

కాగా,ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ కాలపరమితి ఫిబ్రవరి 23వ తేదీతో ముగియనుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అప్పట్లో జనవరి 6న ప్రకటించగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగించింది. బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. 2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి వరుసగా నాలుగో సారి ఢిల్లీలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడంటూ అభివృద్ధి మంత్రంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రజల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేస్తోంది.

Also Read : MLA Harish Rao : కేటీఆర్ అరెస్ట్ పై వస్తున్న రూమర్స్ పై భగ్గుమన్న హరీష్ రావు

Leave A Reply

Your Email Id will not be published!