ECI Comment : ఈసీ ‘కోయిల’ ముందే కూస్తే ఎలా

శివ‌సేన పార్టీ గుర్తుపై తొంద‌రెందుకు

ECI Comment : ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లాలంటే కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క‌మైన పాత్ర పోషించాలి. అది ఎవ‌రి చెప్పు చేతుల్లో ఉండ కూడ‌దు. దానికి స్వ‌యం నియంత్ర‌ణ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే భార‌త రాజ్యాంగం కీల‌క‌మైన స్థానం క‌ల్పించింది.

డెమోక్రసీ బ‌ల‌ప‌డాలంటే ఎన్నిక‌లు కీల‌కం. వాటిని నియంత్రించేది , నిర్వ‌హించేది ఎన్నిక‌ల కేంద్రం (ఈసీ)(ECI) . కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దేశ ప్ర‌ధాన‌మంత్రిని సైతం నిల‌దీశేలా ఉండాలి.  ఒక ర‌కంగా గ‌తంలో ఈసీకి క‌మిష‌న‌ర్ గా ప‌ని చేసిన టీఎన్ శేష‌న్ లాంటి వ్య‌క్తి కావాలి(ECI Comment) అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం

పార్టీలు, గుర్తులు, కేటాయింపులు, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ, అన‌ర్హ‌త వేటు, ఇలా ప్ర‌తిదీ నిర్వ‌హించే బాధ్య‌త‌ను క‌లిగి ఉంటుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ దేశంలో కేవ‌లం ఎన్నిక‌ల‌ప్పుడు మ‌త్ర‌మే ఈసీ అనేది ఒక‌టి ఉంద‌ని గుర్తుకు వ‌స్తుంది. 

ఇప్ప‌టికే సుప్రీంకోర్టు కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ఓటు అనేది ఆయుధం. దానిని స‌క్ర‌మంగా వినియోగించుకునేలా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయాల్సిన బాధ్య‌త ఈసీపై ఉంటుంది. ఇవాళ నేర‌స్తులు, అక్ర‌మాలు, అవినీతికి పాల్ప‌డిన వాళ్లు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. 

ఈ త‌రుణంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం, దాని ప‌రిధిలోని ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల సంఘాలు ప‌ని చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల‌కు పెద్ద ఎత్తున నిధులు ఎల‌క్టోర‌ల్ ఫండ్స్ ద్వారా స‌మ‌కూరుతున్నాయి. వీటి గురించి ఆరా తీయాల్సింది పోయి నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆరోప‌ణ‌ల‌కు దారి తీస్తోంది. 

తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ECI Comment) తీసుకున్న నిర్ణ‌యం వివాదానికి దారి తీసింది. మ‌రోసారి అనుమానాల‌కు తావిస్తోంది. మ‌రాఠాలో ప్ర‌భుత్వం మారింది. శివ‌సేన పార్టీలో ఉన్న ఏక్ నాథ్ షిండే వ‌ర్గం తిరుగుబాటు చేసింది. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదే స‌మ‌యంలో అస‌లైన శివ‌సేన పార్టీ గుర్తు విల్లు బాణం త‌మ‌దేనంటూ ఈసీకి లేఖ రాసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో(Supreme Court) కేసు న‌డుస్తోంది. తుది తీర్పు ఇంకా రాలేదు. కానీ అంత లోపే కేంద్ర ఎన్నిక‌ల సంఘం హ‌డావుడిగా విల్లు..బాణం ఏక్ నాథ్ షిండే వ‌ర్గానికి కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. 

ఒక బాధ్య‌త క‌లిగిన సంస్థ గుర్తు విష‌యంలో ఇంత త్వ‌ర‌గా ఎందుకు నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌శ్నించారు. ఆపై ఈసీ(ECI)  నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను ఆగ‌మేఘాల మీద నియ‌మించ‌డాన్ని సీజేఐ చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. మోదీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది.

ఈ త‌రుణంలో తుది తీర్పు రాకుండానే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం పై దాని విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ తీసేలా చేసింది. ఆయా పార్టీలు, దానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేత‌లకు వేల కోట్లు ఎలా వ‌స్తున్నాయో ఒక‌సారి కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ECI) ఆలోచించాలి. 

త‌న పూర్తి అధికారాల‌ను వినియోగించాలి. అవినీతికి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారి పోయిన పార్టీల‌ను ప్ర‌క్షాళ‌న చేయాలి. పార్టీల‌ను అడ్డం పెట్ట‌కుని ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఊరేగుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటేనే ఈ వ్య‌వ‌స్థ బాగు ప‌డుతుంది. లేక పోతే స‌ర్వ నాశ‌నం అవుతుంది.

Also Read : ఠాక్రే అభ్య‌ర్థ‌న‌కు ‘సుప్రీం’ ఓకే

Leave A Reply

Your Email Id will not be published!