Election Campaign Comment : మైకులు బంద్ మ‌నీ..మ‌ద్యం ఫుల్

ప్రచారం స‌మాప్తం పంపిణీకి సిద్దం

Election Campaign : తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర ప‌డింది. ఆఖ‌రి అంకం ముగిసింది. ఇక మిగిలింది కొన్ని గంట‌లే. ఎన్నిక‌ల సంఘం అనుస‌రిస్తున్న తీరు అనుమానాస్ప‌దంగా ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఏం జ‌ర‌గ‌బోతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. అహంకారానికి ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటంగా ఈ ఎన్నిక‌లు కొన‌సాగాయి. హేమా హేమీలు , దిగ్గ‌జ నాయ‌కులు తెలంగాణ‌ను(Telangana) జ‌ల్లెడ ప‌ట్టారు. ప్ర‌ధానంగా ప‌లు పార్టీలు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నా ప్ర‌ధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య‌నే ఉంటుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. మ‌రో వైపు తాము కీల‌క పాత్ర పోషిస్తామ‌ని తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని ధీమాతో ఉంది భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP). ఇక బీఎస్పీ సైతం ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల జ‌యాప జ‌యాల‌ను ప్ర‌భావితం చేస్తామ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

Election Campaigns Viral

కాంగ్రెస్(Congress) పార్టీ త‌ర‌పున మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాట్ , కేసీ వేణుగోపాల్ , ర‌ణ‌దీప్ సూర్జే వాలా, స‌చిన్ పైల‌ట్ , క‌న్హ‌యా కుమార్ ప్ర‌చారంలో కీల‌క పాత్ర పోషించారు. వీరితో పాటు సీఎం అభ్య‌ర్థిగా జోరుగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన రేవంత్ రెడ్డి తో క‌లిసి స‌భ‌లు, రోడ్ షోలు, ర్యాలీల‌తో హోరెత్తించారు. ఇక బీజేపీ ప‌రంగా చూస్తే ఆ పార్టీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా , పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా ప్ర‌చారం చేప‌ట్టారు. హామీల వ‌ర్షం కురిపించారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ ఒక్క‌టేన‌న్న ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇక అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్ ) బాస్ కేసీఆర్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న‌తో పాటు కేటీఆర్, హ‌రీశ్ రావు, క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌చారంలో కీల‌క పాత్ర పోషించారు. ఈసారి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంది ఆ పార్టీ.

ఇక బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంలో ముఖ్య భూమిక పోషించారు డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న కూడా గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. అన్ని పార్టీలు మేని ఫెస్టోల‌ను విడుద‌ల చేశాయి పోటా పోటీగా. కానీ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేని ఫెస్టో సెన్సేషన్ గా మారింది. ఇక స‌ర్వే సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా హ‌స్తం ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది. ఇక మంగ‌ళ‌వారంతో ప్ర‌చారం ముగిసింది. భారీ ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వ‌చ్చిన మైకులు మూగ బోయాయి. ఎన్నిక‌ల సంఘం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నా అది కూడా ఆశించిన రీతిలో ప‌ని చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ పేప‌ర్లు రాక పోవ‌డం దారుణ‌మ‌ని విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వాపోవ‌డం సెన్సేష‌న్ గా మారింది.

ప్ర‌స్తుతం ప్ర‌ధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీజేపీ పోల్ మేనేజ్మెంట్ల‌పై ఆధార ప‌డ్డాయి. మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయాల‌ని ఆదేశించింది ఈసీ. ఇదే స‌మ‌యంలో కోట్లాది రూపాయ‌లు ప‌ట్టుప‌డడం విస్తు పోయేలా చేసింది. ప్ర‌చారం ముగిసినా ఓట‌ర్ల‌ను పెద్ద ఎత్తున నోట్ల క‌ట్ట‌ల‌తో మ్యానేజ్ చేసే ప‌నిలో ప‌డ్డారు నేత‌లు. ఇక మ‌ద్యంపై బ్యాన్ ఉండ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా నేత‌ల ఇళ్ల‌లోకి లిఫ్ట్ చేశారు. మొత్తంగా ప్ర‌చారం ముగిసినా మ‌నీ, మ‌ద్యం ఏరులై పార‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక నియంత్రించాల్సిన ఈసీ చోద్యం చూస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక మేలు కోవాల్సింది మాత్రం ప్ర‌జ‌లే. విలువైన ఓటును వినియోగించు కోవాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇవాళ అమ్ముడు పోతే రేపు ప్ర‌శ్నించేందుకు కూడా అవ‌కాశం ఉండ‌ద‌ని గుర్తుంచు కోవాలి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : Caste Politics Comment : గెలుపు మంత్రం కులాలే కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!