ENG vs PAK T20 World Cup : టి20 ప్రపంచ కప్ జగజ్జేత ఇంగ్లండ్
5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పరాభవం
ENG vs PAK T20 World Cup : ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు. ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్ ఇచ్చిన బూస్ట్ తో ఏమో కానీ దుమ్ము రేపారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చి 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు.
జగజ్జేతగా నిలిచింది ఇంగ్లండ్(ENG vs PAK T20 World Cup). ఇరు జట్లు కప్ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 137 పరుగులు చేసింది. 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. విశ్వ విజేతలుగా నిలిచింది. రెండో సారి టి20 వరల్డ్ కప్ ను ముద్దాడింది.
సెమీ ఫైనల్ లో బలమైన భారత జట్టుపై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసిన ఇంగ్లండ్ ఏకంగా దాయాది పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అయితే భారత్ ను చితక్కొట్టిన ఓపెనర్ హేల్స్ ను ఆదిలోనే కోల్పోయింది ఇంగ్లండ్. షాహీన్ బంతికి చిక్కాడు.
అతడి స్థానంలో బరిలోకి దిగిన సాల్ట్ కూడా నిరాశ పరిచాడు. 10 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ఇంగ్లండ్ కష్టాల్లో కూరుకు పోయింది. ఆ కొద్ది సేపటికే కెప్టెన్ బట్లర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 26 రన్స్ చేసి రవూఫ్ కు చిక్కాడు. 45 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో స్టార్ హిట్టర్ బెన్ స్టోక్స్ రంగంలోకి దిగాడు.
మరో ఆటగాడు హార్రీ బ్రూక్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. బ్రూక్ వెళ్లినా ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీతో కలిసి బెన్ స్టోక్స్ స్కోర్ బోర్డును ఉరికించాడు. చివరలో ఆలీ అవుట్ అయినా ఏ మాత్రం తొణకలేదు. ఇంగ్లండ్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
Also Read : ఐసీసీ చైర్మన్ గా మరోసారి ఎన్నికైన బార్క్