Fire Accident: గుల్జార్‌హౌస్ లో భారీ అగ్నిప్రమాదం ! 17 మంది మృతి !
గుల్జార్‌హౌస్ లో భారీ అగ్నిప్రమాదం ! 17 మంది మృతి !
Fire Accident : హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీనితో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), నారా చంద్రబాబు నాయడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Fire Accident – బాధిత కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ
అగ్నిప్రమాద ఘటనస్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్నిప్రమాదం(Fire Accident) సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారని అన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన 15నిమిషాలకే ఫైర్ సిబ్బంది చేరుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ రాజకీయం చేయొద్దని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ సంతాపం
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించింది.
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి – సీఎం చంద్రబాబు
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదం కలచివేసింది – పవన్ కల్యాణ్
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదం కలచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ అందించాలి – కిషన్‌రెడ్డి
గుల్జార్‌హౌస్ వద్ద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Minister Kishan Reddy) పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమే అయినా.. ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు
రాజేంద్రకుమార్ (67)
అభిషేక్ మోదీ (30)
సుమిత్ర (65)
మున్నీబాయి (72)
ఆరుషి జైన్ (17)
శీతల్ జైన్ (37)
ఇరాజ్ (2)
హర్షాలీ గుప్తా (7)
రజని అగర్వాల్
అన్య మోదీ
పంకజ్ మోదీ
వర్ష మోదీ
ఇదిక్కి మోదీ
రిషభ్
ప్రథమ్ అగర్వాల్
ప్రాంశు అగర్వాల్
Also Read : Bride Groom: పెళ్లి మండపంలో విషాదం ! పీటలపై వరుడు మృతి !
