అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసానికి చిరునామా అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదర గొట్టారన్నారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారని మండిపడ్డారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు జగన్ రెడ్డి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారని అన్నారు.
ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? అని పేర్కొన్నారు. వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా, మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడి పోతున్నారని అర్థం అవుతోందన్నారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వస్తూనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అని అన్నారు జగన్ రెడ్డి.
