Mission Gaganyaan: అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వ్యోమగాములు వీరే !

అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వ్యోమగాములు వీరే !

Mission Gaganyaan: అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతుంది. తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్(Mission Gaganyaan) కు సిద్ధమౌతోంది. ఈ గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టబోయే వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా గగన్ యాన్ వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ… వారిని స్టాండింగ్ ఒవేషన్‌ తో సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మాట్లాడుతూ… ‘విక్రమ్ సారాభాయ్‌ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్‌ కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే. రాకెట్ మనదే’ అంటూ ప్రధాని వారిని కొనియాడారు. గతంలో రాకేశ్‌ శర్మ భారత్‌ తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనత అందుకున్నారు.

ఈ నలుగురు వ్యోమగాముల బృందం కొద్దికాలం రష్యాలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌ కాస్మోస్‌ వారిని సుశిక్షితులను చేసింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్‌ సోమనాథ్‌ అన్నారు. వారిని రోదసిలోకి పంపి… మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ సాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు.

Mission Gaganyaan – వ్యోమగాములు నలుగురు ఎవరు ? వాళ్ల చరిత్ర ఏంటి ?

గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్:

1982 ఏప్రిల్ 19వ తేదీన తమిళనాడులోని చెన్నైలో అజిత్ జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్, సోర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. వెల్లింగ్‌ టన్‌ లోని డీఎస్ఎస్‌సీ పూర్వ విద్యార్థి అయిన ఆయన… 2003 జూన్ 21వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌ లో నియమించబడ్డారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన ఆయనకు టెస్ట్ పైలట్‌గా దాదాపు 2900 గంటల అనుభవం ఉంది. Su-30 MKI, MiG-21, MiG-21, Mig-29, జాగ్వార్, డోర్నియర్, An-32 మొదలైన వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపారు.

గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్:

1967 ఆగస్టు 26వ తేదీన కేరళలోని తిరువాజియాడ్‌ లో ప్రశాంత్ జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సోర్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్న ఆయన… 1998 డిసెంబర్ 19వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. క్యాట్-ఏ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన ఆయనకు టెస్ట్ పైలట్‌గా 3000 గంటల అనుభవం ఉంది. Su-30 MKI, MiG-21, MiG-29, హాక్, డోర్నియర్, An-32 వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగురవేశారు. ఒక ప్రీమియర్ ఫైటర్ Su-30 Sqnకి ఆయన నాయకత్వం వహించారు.

గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్:

1982 జులై 17వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో అంగద్ జన్మించారు. ఎన్డీఏ పూర్వి విద్యార్థి అయిన ఆయన.. 2004 డిసెంబర్ 18వ తేదీన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన అంగద్‌కు టెస్ట్ పైలట్‌గా దాదాపు 2000 గంటల అనుభవం ఉంది. ఆయన Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 వంటి వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేశారు.

వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా:

1985 అక్టోబర్ 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుభాంశు జన్మించారు. ఎన్డీఏ పూర్వ విద్యార్థి అయిన ఆయన IAF ఫైటర్ స్ట్రీమ్‌లో 2006 జూన్ 17వ తేదీన నియమించబడ్డారు. ఫైటర్ కంబాట్ లీడర్ అయిన శుభాంశుకు టెస్ట్ పైలట్‌గా సుమారు 2000 గంటల అనుభవం ఉంది. Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 మొదలైన వివిధ రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగురవేశారు.

Also Read : Anant Ambani : త్వరలో అంబానీ ఇంట పెళ్లి సందడి..2500 రకాల ఐటమ్స్ అట..

Leave A Reply

Your Email Id will not be published!