GHMC: ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
GHMC : ఆస్తి పన్ను వసూలు విషయంలో జీహెచ్ఎంసీ(GHMC) కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆస్తిపన్ను చెల్లించకుండా… ఆస్తులు అమ్ముకుంటున్న వారిని నిలువరించేందుకు చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరి పన్ను బకాయిల్లేని ఆస్తులనే రిజిస్ట్రేషన్ చేసే నిబంధన హైదరాబాద్ కు అవసరమని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మొండి బకాయిలు వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆస్తిపన్ను బకాయిలు రూ.9 వేల కోట్ల మేర పేరుకుపోవడంతో బల్దియా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ సబ్ రిజిస్ట్రార్లు తాము చట్ట ప్రకారమే పత్రాలను పరిశీలిస్తామని బల్దియాకు తేల్చి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్తిపన్ను బకాయిలతో ముడిపెట్టి రిజిస్ట్రేషన్లను నిలిపేయలేమని, ఇది చట్ట సవరణతోనే సాధ్యమని పేర్కొన్నారు.
GHMC Sensational Decision
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఆస్తిపన్ను పరిధిలో 23 లక్షల నిర్మాణాలున్నాయి. అందులో దాదాపు ఐదు లక్షల భవనాలు సరిగా పన్ను చెల్లించడం లేదు. 15ఏళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం నుంచి బల్దియాకు పన్ను చెల్లించని నిర్మాణాలు దాదాపు 5వేలు ఉంటాయని, అందులో 90శాతం వాణిజ్య భవనాలేనని సమాచారం. ఇటీవల కమిషనర్ ఇలంబర్తి జోన్ల వారీగా అత్యధికంగా పన్ను బకాయిలున్న 25 నిర్మాణాల జాబితాను ఆయా జోనల్ కమిషనర్లకు పంపించి చర్యలు తీసుకోవాలన్నారు.
బెంగుళూరులో ఆస్తి పన్ను వసూలు ఇలా
సబ్‌రిజిస్ట్రారు ఇంటి నంబరు లేదా పీటీఐఎన్(ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు)ను పొందుపరచగానే పన్ను బకాయి ఎంతో కంప్యూటర్‌లో ప్రత్యక్షమవుతుంది. బకాయి ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు. బెంగళూరు మహా నగరపాలక సంస్థ ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆస్తిపన్నులో చెత్త పన్నును జమ చేస్తోందని, ఇక్కడ స్వచ్ఛ ఆటోలు రుసుము వసూలు చేసుకుంటున్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.
Also Read : PM Narendra Modi: ట్రంప్ సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ లో చేరిన ప్రధాని మోదీ