Forest Lands: దేశవ్యాప్తంగా ఆక్రమణకు గురైన అటవీ భూముల వివరాలు వెల్లడించిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఆక్రమణకు గురైన అటవీ భూముల వివరాలు వెల్లడించిన కేంద్రం

Forest Lands : దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఆక్రమణకు గురైన ఈ అటవీ భూముల(Forest Lands) మొత్తం ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల మొత్తం భూభాగం కంటే ఎక్కువ అని పేర్కొంది. అంతేకాదు ఈ అటవీ భూముల ఆక్రమణలపై పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా సమాచారాన్ని వెల్లడించలేదని తెలిపింది. దేశంలో అటవీ భూములు(Forest Lands) ఆక్రమణకు గురవుతున్న అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ… రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతున్న భూముల వివరాలను సమర్పించాలని గతేడాది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

Forest Lands Enchrochments

ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదించిన వివరాల ప్రకారం… అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమణ్‌దీవ్, కేరళ, లక్షద్వీప్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, సిక్కిం, మధ్యప్రదేశ్, మిజోరం, మణిపుర్‌ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆక్రమణకు గురైన భూముల వివరాలను సమర్పించాయి. బిహార్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, నాగాలాండ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వివరాలు సమర్పించాల్సి ఉంది. మొత్తం ఆక్రమిత అటవీ భూముల్లో 409.77 చదరపు కిలో మీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాట్లు ఆ నివేదికలో వెల్లడించారు.

అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 2024 నాటికి 5,460 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమణకు గురికాగా, అస్సాంలో 3,620 చదరపు కిలోమీటర్లు, కర్ణాటకలో 863.08 చదరపు కిలోమీటర్లు, తమిళనాడులో 157.68 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 133.18 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూభాగం ఆక్రమణకు గురైందని నివేదికలో పేర్కొంది. పట్టిక రూపంలో సంబంధిత సమాచారాన్ని అందించాలని కోరుతూ వివరాలు పంపని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవల లేఖలు పంపినట్లు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి తెలిపింది. ఇక ఏపీలో 133 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూముల ఆక్రమణ జరిగిందని నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇది దేశవ్యాప్తంగా జరిగిన ఆక్రమణలలో ఏపీ 12వ స్థానంలో నిలిచినట్లు తేటతెల్లమౌతోంది.

Also Read : Supreme Court: ‘మీ తీరు అమానవీయం’ అంటూ సీఎం యోగి సర్కార్‌ పై సుప్రీం కోర్టు సీరియస్

Leave A Reply

Your Email Id will not be published!