Gruha Jyothi: ‘గృహజ్యోతి’ పథకం కోసం వివరాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది
‘గృహజ్యోతి’ పథకం కోసం వివరాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది
Gruha Jyothi: తెలంగాణాలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి కారణమైన ‘గృహజ్యోతి(Gruha Jyothi)’ పథకం అమలకు రాష్ట్ర ప్రభుత్వం కరసత్తు చేస్తుంది. ‘గృహజ్యోతి’ కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అర్హులైన కుటుంబాలను గుర్తించే పనిలో పడ్డారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబరు… ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకుని తొలిదశ ‘గృహజ్యోతి’ పథకం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 81,54,158 మంది దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 30 శాతం మంది రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. దరఖాస్తుదారుల్లో సుమారు 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం.
Gruha Jyothi Scheme Updates
ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ సిబ్బంది… ‘గృహజ్యోతి’ పథకం కోసం ధరఖాస్తు చేసుకున్న కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబరు… ఈ మూడింటి వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక… ‘గృహజ్యోతి’ పథకంకు అర్హులైన కుటుంబాల ఇళ్ళకు సంబంధించిన ప్రాథమిక సంఖ్య తెలుస్తుంది. ఆ ప్రాధమిక సంఖ్య ఆధారంగా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జీవో జారీచేయనుంది. జీవోలో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్‌లైన్ లో నమోదు చేయడానికి ఇప్పటికే ‘విద్యుత్ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లకు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం ‘ప్రజాపాలన’లో దరఖాస్తులిచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలే లేవు. ‘గృహజ్యోతి’ పథకంకు ప్రాథమిక అర్హతలున్న కుటుంబాల్లో గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నెలవారీ సగటు కరెంటు వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సంవత్సరం సగటు లెక్కలను డిస్కంలు ఆన్‌లైన్ ద్వారా సేకరిస్తున్నాయి.
గత ఏడాది 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు ఇప్పుడు నెలకు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్లే వాడి ఉంటే… దానికి పది శాతం కోటా కింద 9 యూనిట్లు కలిపి… మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో అమలవుతోంది. ఇక్కడ కూడా దాన్నే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే జీవో విడుదలైతే మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read : Droupadi Murmu: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము !