CAA: గుజరాత్ లో సీఏఏ అమలు ! 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం !
గుజరాత్ లో సీఏఏ అమలు ! 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం !
CAA: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ను గుజరాత్ ప్రభుత్వం అమలుచేసింది. అహ్మదాబాద్ లో నివాసముంటున్న పాకిస్థాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు ఈ చట్టం క్రింద భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు అధికారం ఉందని ప్రకటన తెలిపింది. ఇప్పటి వరకు 1,167 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు పేర్కొంది.
CAA Updates
నూతన భారత్ కల సాకారానికి అందరితో కలిసి పనిచేయాలని తాజాగా పౌరసత్వం పొందిన వారికి మంత్రి పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి పథంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నామన్నారు. భారత పౌరసత్వం పొందిన వారందరినీ ప్రధాన స్రవంతిలో భాగం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. పాక్, అఫ్గాన్, బంగ్లా నుంచి వచ్చిన బాధిత మైనారిటీలకు సులువుగా, వేగంగా ఇక్కడి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం మార్చి 11న గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ ప్రకారం… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి నసత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.
Also Read : Indian Navy: ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ !