Gulzar House Fire: గుల్జార్‌ హౌస్‌ ప్రమాదానికి అక్రమ కరెంట్‌ కనెక్షన్లే కారణమా ?

గుల్జార్‌ హౌస్‌ ప్రమాదానికి అక్రమ కరెంట్‌ కనెక్షన్లే కారణమా ?

 

 

హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్‌ హౌస్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్‌ కనెక్షన్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన బిల్డింగ్‌ లోని నగల దుకాణం మూసివేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి… కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ చోర్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌ వాడకంతో బాధిత కుటుంబ కరెంట్‌ మీటర్లపై లోడ్‌ బాగా పెరిగింది. ఆ కరెంట్‌ లోడ్‌తో ప్రమాదం జరిగిన ఇంట్లోని కరెంట్ మీటర్‌ బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. అనంతరం మీటర్‌ బాక్స్‌ పక్కన ఉన్న ఉడెన్‌ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఉడెన్‌ షోకేజ్‌ నుంచి ఏసీ కంప్రెసర్‌ని మంటలు తాకి, ఆపై మంటలు భారీగా ఎగిసిపడి పెద్ద ప్రమాదానికి కారణమైనట్టు భావిస్తున్నారు. దీనితో స్థానికంగా చాలా కాలంగా జరుగుతున్న ఈ కరెంట్‌ దొంగతనాలపై పోలీసులు, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఇంటికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యుల నుంచి కూడా దర్యాప్తు బృందం వివరాలు సేకరిస్తోంది.

కాగా, ప్రమాదంపై విచారణ వేగంగా జరుగుతోంది. ఈ ప్రమాద ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. మృతుల కుటుంబ సభ్యుడు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో ఆదివారం ఏం జరిగిందో ఉత్కర్ష్ మోదీ పోలీసులకు వివరించారు. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా గుల్జార్ హౌస్‌లో నివాసముంటున్నారు. నిన్న అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 21 మంది కుటుంబసభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు. అత్తాపూర్‌లో ఓ వేడుకకు హాజరై వచ్చిన వీరంతా ఇంట్లోనే నిద్రించారు. అయితే, తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకూ పెరగడంతో ఇంట్లో ఉన్న నాలుగు ఏసీ కంప్రెసర్లకు మంటలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది.

 

గుల్జార్‌హౌస్‌ వద్ద ఘటనపై నివేదిక ఇవ్వండి – మానవహక్కుల సంఘం ఆదేశం

 

గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌ ఛైర్మన్‌… కేసును విచారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. భవన భద్రత, విద్యుత్‌ నిర్వహణపై మీడియాలో కథనాలు రావడంతో కమిషన్‌ స్పందించింది. 17 మంది మృతిపై జూన్‌ 30లోగా నివేదిక సమర్పించాలని సీఎస్‌తోపాటు హైదరాబాద్‌ సీపీ, అగ్నిమాపక డీజీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ చీఫ్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది. చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

 

Leave A Reply

Your Email Id will not be published!