High Court Shock to MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ !
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ !
High Court Shock to MLCs: తెలంగాణాలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియపై ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, న్యాయమూర్తి జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్… న్యాయస్థానంలో పెండింగ్ లో ఉండగా నియామక ప్రక్రియపై ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
High Court Shock to MLCs Viral
దీనిపై అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ పిటిషన్ లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేవని… గత విచారణ సందర్భంగా పరస్పర ఒప్పందం మేరకు ఈ నెల 24వ తేదీ దాకా ఎమ్మెల్సీల నియామకం చేపట్టబోమని హామీ ఇచ్చామని చెప్పారు. అయితే 24న జరిగిన విచారణలో ఒప్పందాన్ని పొడిగించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరలేదని… ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించానని, అయినా పిటిషనర్లు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. అంతేకాదు ఉత్తర్వులను పొడిగించాలని కూడా పిటీషనర్లు కోరలేదని పేర్కొన్నారు. దీనితో పిటిషన్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేనందువల్ల ఎమ్మెల్సీల నియామక ప్రక్రియలో గవర్నర్ ముందుకెళ్లారని ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటికే నియామక ప్రక్రియ నోటిఫికేషన్ జారీ అయిందని… ప్రజాప్రాతినిధ్య చట్టం కింద జారీ అయిన నోటిఫికేషన్ ను నిలిపివేసేందుకు కోర్టులకు అధికారం లేదని ఏజీ ధర్మాసనానికి తెలిపారు.
దీనితో పిటిషనర్ల తరఫున మరో సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ… నియామక ప్రక్రియ చేపట్టడం ద్వారా తమ నమ్మకంపై దెబ్బకొట్టారన్నారు. దీనితో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ… అందరి అభిప్రాయాల మేరకే విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియను తాము నిలిపివేయడం లేదని… కేవలం దానిపై యథాతథస్థితి కొనసాగించాలని మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.
అసలు ఏం జరిగిందంటే ?
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణ పేర్లను ప్రతిపాదించారు. అయితే ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. శ్రవణ్‌కుమార్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని, సత్యనారాయణ ఓ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొంటూ వారి పేర్లను గవర్నర్ తమిళిసై(Tamilisai) తిరస్కరించారు. దీనితో తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఇది ఇలా ఉండగా ఇటీవల అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకు ప్రతిపాదనలు పంపించింది. దీనితో గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన .. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు. వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 27న జీవో నంబరు 12 జారీ చేసింది. దీనితో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ పిటిషనర్లు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కోదండరాం, ఆమిర్ అలీఖాన్లనూ ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ మరో మధ్యంతర పిటిషన్ వేశారు.
Also Read : CM Revanth Reddy : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అదే ప్లేస్ లో..త్వరలో రానున్న సీఎం