IND vs SA 2nd ODI : అయ్యర్ అయ్యారే కిషన్ భళారే
7 వికెట్లతో సఫారీపై భారత్ విక్టరీ
IND vs SA 2nd ODI : రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు భారీ టార్గెట్ ను సులభంగా ఛేదించింది. మొదటి వన్డే మ్యాచ్ లో కేవలం 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో(IND vs SA 2nd ODI) అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. ఇషాన్ కిషన్ దూకుడు శ్రేయస్ అయ్యర్ సెన్సేషన్ ఇన్నింగ్స్ కు తోడు సంజూ శాంసన్ సమయోచితమైన బ్యాటింగ్ భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరీర్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ అనవసరమైన షాట్ ఆడి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తంగా మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ లో దక్షిణాఫ్రికా, టీమిండియా చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి.
ఇక ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సీరీస్ స్వంతమవుతుంది. 279 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా చేదించడం ప్రత్యర్థి జట్టును విస్తు పోయేలా చేసింది. మూడో వికెట్ కు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ 161 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
శ్రేయస్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కాడు. కిషన్ సిక్సర్లు, ఫోర్ల మోత మోగించాడు. శ్రేయస్ అయ్యర్ 111 బంతులు ఆడి 113 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు.
ఇషాన్ కిషన్ 84 బంతులు ఆడి 93 రన్స్ చేశాడు. 45.5 ఓవర్లలోనే భారత్ టార్గెట్ పూర్తి చేసింది. కిషన్ చేసిన పరుగుల్లో 7 సిక్సర్లు 4 ఫోర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ ఎక్కడా తడబడకుండా గోడలా నిలిచాడు. సిరాజ్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టులో మార్క్ రామ్ 89 బంతులు ఆడి 79 రన్స్ చేస్తే రీజా హెండ్రిక్స్ 76 బంతులు ఆడి 74 పరుగులు చేశారు.
Also Read : ఆటను ఆస్వాదిస్తే ఒత్తిడి ఉండదు – కపిల్ దేవ్