శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

నూత‌న ఈవో ముద్దాడ ర‌విచంద్ర కీల‌క కామెంట్స్

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈవోకు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓలు వీర‌బ్రహ్మం, శ‌ర‌త్ లు ఘ‌నంగా స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా బాధ్యతలు స్వీక‌రించిన అనంతరం ముద్దాడ ర‌విచంద్ర‌కు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు, భక్తుల సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో భక్తులకు చక్కని సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అటు తరువాత ఆయన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌న స‌ర్వీస్ లో అత్యంత నిజాయితీ ప‌రుడైన అధికారిగా గుర్తింపు పొందిన అనిల్ కుమార్ సింఘాల్ ను ఉన్న‌ట్టుండి ఈవో ప‌ద‌వి నుంచి తొల‌గించింది. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే రిపోర్ట్ చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఇది భ‌క్తుల‌ను విస్తు పోయేలా చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!