తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయిద్యాలు , మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు . శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తి దాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకటయ్య చౌదరి, స్థానిక శాసన సభ్యులు పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మీ, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆలయ ప్రత్యేకాధికారి, సిపిఆర్వో డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో శ గోపినాథ్, కంకణ భట్టర్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గరుడ సేవ సందర్బంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు, తాగునీరు, భద్రత, పార్కింగ్, విద్యుత్, పుష్ప అలంకరణలు తదితర ఏర్పాట్లపై ప్రసంశించారు.