#ArmyDay : జనవరి 15 భారత సైనిక దినోత్సవం

మనకు స్ఫూర్తినిచ్చే ప్రతి అంశం ప్రకృతిలో ఉన్నదని,దాని ఆధారంగా మనం స్ఫూర్తి పొంది దేశసేవకు సిద్ధం కావాలని దివంగత నేత, యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన "డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు"

Army Day : మనకు స్ఫూర్తినిచ్చే ప్రతి అంశం ప్రకృతిలో ఉన్నదని,దాని ఆధారంగా మనం స్ఫూర్తి పొంది దేశసేవకు సిద్ధం కావాలని దివంగత నేత, యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన “డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు” ఎన్నో మార్లు దేశభక్తి కొరకు యువతకు తెలియచేశారు.

“దేశమును ప్రేమించుమన్నా…మంచి అన్నది పెంచుమన్నా…వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌’…అన్నారు గురజాడ అప్పారావు గారు.దేశభక్తి యొక్క గొప్పదనాన్ని ఎందరో ఎన్నెన్నో రీతులుగా వివరించి ఆనాటి నుండి నేటి వరకు దేశభక్తిని పెంపొందించుటకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

“జాతిని జాగృతం చేసేది దేశభక్తి,జాతి జనులను సమైక్యంగా నడిపించేది దేశభక్తి, అభివృద్ధికి, అభ్యున్నతికి అవసరమైనది దేశభక్తి,”
అటువంటి దేశభక్తి ప్రతి భారతీయుని నరనరాన ఉండాలని స్వామీ వివేకానంద తన ఉపన్యాసాలలో ఎన్నోమార్లు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అభిమానం ఉంటే ‘దేశ భక్తి’ కూడా తోడై దేశం మరింత అభ్యున్నతి సాధిస్తుంది. ప్రతి ఒక్కరికి “ఇది నా దేశం” అనే భావన మనసులో ఉండాల్సిన అవసరం ఉంది.

మనదేశ ప్రజల రక్షణ కోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు నివాళులర్పిస్తూ, నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకుంటూ, ఈ రోజు భారత సైనిక దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఆయిన “సైనికుల త్యాగాలను స్మరించుకుందాం.. సైనికులకు సెల్యూట్ చేద్ధాం.” మన దేశభక్తిని చాటుదాం.

భారతదేశానికి చెందిన ఫీల్డు మార్షల్‌ కె.యం.కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) 1949 జనవరి 15 న భారత సైన్యానికి (Army Day )తొలి కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని “జనవరి 15 న ప్రతి సంవత్సరం జాతీయ సైనిక దినోత్సవం” జరుపుకుంటున్నాం. భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బట్చార్ (Sir Francis Butcher) తరువాత భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా కె.యం.కరియప్ప బాధ్యతలు చేపట్టారు.

ఈరోజు ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు ఇరవైనాలుగు గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, మంచుకొండల మంచును, నిరంతరం కురిసే వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఉండడం వల్ల మాత్రమే సాధ్యమైంది. కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచుకొండల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్న ఓ సైనికులారా మీకు వందనం. కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు మన సైనికులు.

దేశానికి అన్నం పెట్టేది రైతన్నే అయినా,దేశాన్ని కాపాడేది సైనికుడు.అందుకే ముందుగా “జై జవాన్, ఆ తరువాత జై కిసాన్”‌ అన్నారు పెద్దలు. దేశసేవ కోసం ఎంతోమంది సైనికులు సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను(Army Day ) మరోమారు స్మరించుకుందాం. అమరసైనికులకు నివాళులు అర్పిద్దాం.

ఎన్నో పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని భారత సైనికులు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. 1948లో చివరి బ్రిటిషన్‌ కమాండర్‌ జనరల్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్‌గా కేఎం కరియప్ప జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈ రోజున ‘జాతీయ సైనిక దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తూ,వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు కూడా అందజేస్తారు.

భారత దేశానికి సహజ సిద్ధమైన,ప్రకృతి కల్పించిన రక్షణ వలయం ఉంది. ప్రకృతి వరంగా ఉన్న మంచు పర్వాతాలు ఓ వైపు, మూడువైపులా ఉన్న సముద్రం దేశ రక్షణకు బలంగా ఉన్నాయి. అయినకూడా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురవుతున్న సవాళ్ల వల్ల సరిహద్దు రక్షణ అనుక్షణం మనకు సవాల్ విసురుతోంది,అయిన ప్రతి క్షణం మన ఆధిపత్యం కొనసాగుతుంది. ఎటువంటి సవాల్‌నైనా ధైర్యంగా తిప్పికొట్టే సైనికబలం మనకుంది. మనం ప్రశాంతంగా ఉండి, మనుగడ సాగించేందుకు రక్షణ కవచంగా నిలుస్తున్నదే భారత సైన్యం. “వారి ధైర్యం అసమానం,వారి పోరాట స్ఫూర్తి అనన్య సామాన్యం,వారి త్యాగాలు సదా స్మరణీయం.”

దేశరక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమర జవానుల సేవలను స్మరణకు తెచ్చుకోవడం “సైనిక దినోత్సవం”(Army Day )యొక్క ప్రధాన ఉద్దేశం. దేశానికి స్వాతంత్య్రము సంపాదించడానికి సమరయోధులు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో, ఆ తర్వాత భారత సైన్యం కూడా అదేస్థాయి పాత్రను దేశరక్షణలో పోషించింది. స్వతంత్ర భారతదేశానికి ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా, చాకచక్యంగా సైన్యం ఎదుర్కొంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సవాల్‌ విసిరినప్పుడు సైనికులు అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు.

అనేక స్వాతంత్య్ర సమరాల అనంతరం బ్రిటీషర్ల నుంచి స్వేచ్ఛ పొందిన నేటి భారత సైన్యం పరిధి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం భారత సైన్యం సరిహద్దుల్లో అన్ని వేళలా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. సవాళ్లతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఎదురొడ్డి పోరాడడంలో సైనికులు ముందుంటున్నారు. వ్యక్తిగత జీవితాలను కూడా త్యాగం చేసి భారతీయుల శ్రేయస్సు కోసం ధైర్యసాహసాలతో భారత సైన్యం ముందడుగు వేస్తోంది. దేశాన్ని, దేశ జనులను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతా పూర్వక గౌరవం కలిగి ఉండాలి. ఇందుకు మంచి సందర్భం సైనిక దినోత్సవం.

అమర జవానులకు నివాళులర్పిస్తూ జనవరి 15న ఇండియా గేట్‌ వద్ద ఉన్న అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద జ్యోతి వెలిగిస్తారు. అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు. అయితే ఇది ఢిల్లీకే పరిమితం కాకూడదు. గ్రామగ్రామాన,వీధి వీధిన ప్రతి ఒక్క భారతీయుడు సైనికుల త్యాగాలను స్మరణకు తెచ్చుకుని,మరో పదిమందికి మన వీర సైనికుల త్వాగాన్ని తెలియ చేయాలి.సైనికుడు ఎక్కడ కనబడ్డ సెల్యూట్ చేసే సంస్కృతి రావాలి. సైనిక దినోత్సవం రోజున దేశరాజధానిలో ఆర్మీ కమాండ్‌ ప్రధాన కార్యాలయాల్లో పరేడ్లు, ఇతర మిలటరీ షోలు నిర్వహిస్తూ,మన వారి సామర్థ్యాన్ని ప్రజలకు కనబడేలా చూస్తారు..

ఏ కార్యక్రమమైనా, ఉత్సవమైనా ఓ సందేశాన్ని జాతి జనులకు అందించడమే ప్రధాన ఉద్దేశం. ముందు తరం వారి అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం, వారు సూచించిన మార్గంలో ప్రయాణించడం, భవిష్యత్తు తరాలకు మరింత మెరుగైన ఆశయాలను అందించడం ఇందులో ఇమిడి ఉంది. ఏది చేసినా మానవాళి శ్రేయస్సు కోసమే.అలానే ఈ రోజు సైనిక దినం కూడా నేటి యువతకు బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ప్రత్యేక రోజుల్లో ఆయా సందర్భాలను స్పురణకు తెచ్చుకుని గుర్తు చేసుకుంటాం. ఇదే క్రమంలో ఏటా జనవరి 15వ తేదీన ‘భారత సైనిక దినోత్సవం’ జరుపుకోవడం వెనుక మన బాధ్యత ఎంతో ఉంది.బాల్యం నుంచి ఆర్మీలో పనిచేయాలన్న కోరిక కలిగేలా చిన్ననాటి నుండి దేశభక్తిని వారి గుండెల్లో నింపాల్సిన భాద్యత తల్లిదండ్రులది మరియు ఉపాధ్యాయులది.

భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం(Army Day ), అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలలో ఉన్నట్లు ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం మన భారత దేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు.

1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, పాకిస్తాన్‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి “ఇండియన్ ఆర్మీ” అని పేరు పెట్టబడింది.అప్పటి నుండి మన సాయుధబలం క్రమక్రమంగా పెరుగుతూ,నేడు బలమైన శక్తిగా ఉన్నాము.నేడు మనకు రాపిడ్ డివిజన్లు, ఇన్‌ఫాంట్రీ డివిజన్లు,మౌంటైన్ డివిజన్లు,ఫిరంగి డివిజన్లు,ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడులు,పేరాచూట్ బ్రిగేడ్,ఇంజనీర్ బ్రిగేడులు,హెలికాప్టర్ యూనిట్లు ,ట్యాంక్ రెజిమెంట్లు,ఫిరంగి రెజిమెంట్లు, విధులు నిర్వర్తిస్తున్న సైన్యము,రిజర్వ్ సైన్యం, ప్రధాన యుద్ధ ట్యాంకులు,ఫిరంగులు, బాల్లిస్టిక్ మిస్సైళ్ళ,ఎయిర్ మిస్సైళ్ళు,యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు మొదలగునవి ఉన్నాయి. భారత సైనిక దళ ప్రధాన ఆయుధం యుద్ధట్యాంకులు,T-90 భీష్మ ట్యాంకు,అర్జున్ MBT, T-72 T-90, ఆకాశ్ క్షిపణి,బ్రహ్మోస్ ,పృథ్వి, అగ్ని1,అగ్ని2, అగ్ని3 మొదలగునవి మనఆయుధ సంపద.

భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన ఆనందంలో మనం ఉండగానే 1947 అక్టోబర్‌ 27న విభజనకు గురైన పాకిస్తాన్‌ దళాలు మన దేశనికి తలమానికంగా ఉన్న కాశ్మీర్‌ను ఆక్రమించడానికి దండెత్తి రాగా మన భారత దళాలు శతృవులను తరిమి తరిమికొట్టి స్వాతంత్య్ర దేశ చరిత్రలో తొలివిజయాన్ని నమోదు చేసాయి. ఇది స్వాతంత్ర భారత్ కు తొలివిజయం. తరువాత 1962లో చైనా దురాక్రమణ దారులకు, 1965, 1971లో పాకిస్తాన్‌ వారికి, 1999లో కార్గిల్‌ సైనిక చర్యలతో పాటు వివిధ ఆపరేషన్లలో శతృవులను వెనుతిరిగి చూడకుండా తరిమి వేసింది మన భారతసైన్యం. ఇలా ఎన్నెన్నో విజయాలు మనకున్న ఎందరో సైనికులను భరత మాత కోల్పోయింది.

వీరుల త్యాగాలను స్మరించుకుందాం.. సైనికులకు సెల్యూట్ చేద్ధాం.నేడు దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు సైనిక దినోత్స(Army Day ) వాన్ని జరుపుకోనున్నాయి. భారత నావికాదళం, భారత వైమానిక దళం, దేశ రక్షణలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి. భారతమాత రక్షణలో భాగమైన ఓ సైనిక నీకు వందనం.ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంచుదాం.అందరికి దేశభక్తి పంచుదాం.

No comment allowed please