Jiah Khan Comment : తెర వెనుక క‌థ క‌న్నీటి వ్య‌ధ‌

జియా ఖాన్ సూసైడ్ వెనుక

Jiah Khan Comment : సినిమా ప్ర‌పంచం అదో రంగుల లోకం. క‌వ్వించి, మైమ‌రిపించి, గుండెల్ని మీటే తారామ‌ణులు బ‌య‌ట‌కు క‌నిపించేంత అందంగా ఉండ‌వు. అందుకే సినీ క‌వి చెప్పిన‌ట్లు అంద‌మైన లోక‌మ‌ని అందరూ అంటూంటారు ..కానీ అంద‌మైన‌ది కానేక‌ద‌ని వాపోయాడు.

కెరీర్ ఉన్న‌త స్థితిలో ఉన్న స‌మ‌యంలో కొంద‌రు రాలి పోతే మ‌రికొంద‌రు అర్ధాంత‌రంగా బ‌ల‌వంతపు మ‌ర‌ణాల‌కు లోన‌య్యారు. ఇది తీర‌ని విషాదం. సిల్క్ స్మిత‌, ఆర్తి అగ‌ర్వాల్ , జియా ఖాన్..(Jiah Khan Comment) ఇలా చెప్పుకుంటూ చాంతాడంత అవుతుంది జాబితా.

క‌ళ్ల ముందు అన్నీ ఉన్నా ఏదో తెలియ‌ని వెలితి. వెంటాడే లోకం..వేధించే అభిమాన సంద్రం ..పైపెచ్చు ఊపిరి తీసుకోలేనంత ప్ర‌చారం. వెర‌సి అంద‌మైన భ‌వంతులు, జిగేళ్ మ‌నిపించే సౌక‌ర్యాలు..కావాల్సినంత ఎంజాయ్ చేసేంతటి స్వేచ్ఛ ఉన్నా ఎందుక‌నో ప‌ది కాలాల పాటు బ‌త‌కాల్సిన వాళ్లు, త‌మ న‌ట‌న‌తో అల‌రించాల్సిన వాళ్లు అనుకోకుండా రాలి పోవ‌డం విస్తు పోయేలా చేస్తోంది.

ఇది ప్ర‌త్యేకించి ఎక్కువ‌గా సినీ రంగం, ఆ త‌ర్వాత క్రీడా , రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు పాకుతోంది. ఇక స‌ర్వ సాధార‌ణంగా ప్ర‌తి చోటా ఇగోను భ‌రించ లేక‌, లైంగిక‌, మాన‌సిక వేధింపులు తాళ లేక త‌నువులు చాలిస్తున్న వాళ్లు ప్రతి రోజూ వేలాది మంది ఉండ‌నే ఉన్నారు. వాళ్లు ప్ర‌భుత్వ లెక్క‌ల్లోకి రారు. ఎందుకంటే వాళ్ల చావులు అంత‌గా ప్ర‌భావితం చేసేలా ఉండ‌వు.

వాళ్లు సాధార‌ణంగానే ఈ భూమిపైకి వ‌స్తారు. అలాగే వెళ్లి పోతారు. ఎటొచ్చీ సెలెబ్రిటీల గురించే బాధంతా. తాజాగా మ‌రోసారి న‌టి జియా ఖాన్ అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 20, 1988లో పుట్టింది. స్వ‌స్థ‌లం న్యూయార్క్ , అమెరికా. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క‌ళ్ల‌ల్లో ప‌డింది. ఆయ‌న బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో నిశ్శ‌బ్ద్ అనే పేరుతో సినిమా తీశాడు.

వ‌య‌సు పైబ‌డిన వ్య‌క్తి పాత్ర‌లో బ‌చ్చ‌న్ న‌టిస్తే లేత వ‌య‌సు అమ్మాయి పాత్ర‌లో న‌టించింది జియా ఖాన్. ఆ సినిమా ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. ప్ర‌త్యేకించి బిగ్ బీ న‌ట‌న కంటే సోగ‌క‌ళ్ల సుంద‌రి జియా ఖాన్ న‌ట‌న , అందం, హావ భావాలు ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా 2007లో వ‌చ్చింది. ఫిలిం ఫేర్ పుర‌స్కారానికి నామినేట్ అయ్యింది.

ఆ త‌ర్వాత త‌మిళంలో హిట్ అయిన గ‌జిని చిత్రం హిందీలో న‌య‌న‌తార పాత్ర‌లో జియా ఖాన్(Jiah Khan) న‌టించింది. 2010లో సాజిద్ ఖాన్ తీసిన హౌస్ ఫుల్ లో ఆఖ‌రు సారిగా కినిపించింది జియా ఖాన్. న‌టించింది కేవ‌లం మూడు సినిమాలే. కానీ అద్భుత‌మైన పేరు సంపాదించుకుంది ఆమె.

అనుకోకుండా అనుమానాస్ప‌ద స్థితిలో 2013లో త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకుంది జియా ఖాన్. దీనికి కార‌ణం మ‌రో ప్ర‌ముఖ న‌టుడు ఆదిత్యా పంచోలి త‌న‌యుడు సూర‌జ్ పంచోలీ కార‌ణ‌మంటూ త‌ల్లి ర‌బియా అమిన్ ఆరోపించింది. ఈ మేర‌కు కేసు కూడా న‌మోదైంది.

సుదీర్ఘ కాలం పాటు సాగింది ఈ కేసు విచార‌ణ‌. చివ‌ర‌కు కోర్టు ఎవ‌రైతే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారో అత‌డు నిర్దోషి అంటూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. దీనిని జియా ఖాన్ త‌ల్లి ఖండించింది. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నుంది. ఏది ఏమైనా జియా ఖాన్ ఆత్మ‌హ‌త్య సినిమా రంగంలోకి రావాల‌ని అనుకుంటున్న వాళ్లు, ఇప్ప‌టికే ఉన్న వాళ్లకు ఓ గుణ‌పాఠం అని చెప్ప‌క త‌ప్ప‌దు. జియా ఖాన్ న‌టి మాత్ర‌మే కాదు ఆమె ఓ నెల‌వంక‌..కాదంటారా.

Also Read : బ్రిజ్ భూష‌ణ్ సింగ్ పై కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!