Justice Madan B Lokur: విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ గా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ !

విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ గా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ !

Justice Madan B Lokur: తెలంగాణలో విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గతంలో పవర్‌ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీనితో కొత్త చైర్మన్‌ గా ప్రభుత్వం మదన్‌ లోకూర్‌(Justice Madan B Lokur)ను ఎంపిక చేసింది.

Justice Madan B Lokur…

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు… యాదాద్రి, భద్రాద్రి సబ్‌క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని నియమించారు. విచారణ జరుగుతున్న సమయంలో… కమిషన్‌ ఏర్పాటు, దాని ఛైర్మన్‌ నిష్పాక్షికతను సవాల్‌ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం… కమిషన్‌ ఛైర్మన్‌ ను మార్చాలని ఆదేశించింది. అదే సమయంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌ ను సైతం కొట్టేయాలన్న కేసీఆర్‌ వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌ ను నియమిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా నూతన చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ను నియమించింది.

Also Read : Jammu-Jodhpur Express: జమ్మూ – జోధ్‌పూర్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు !

Leave A Reply

Your Email Id will not be published!