Justice Yashwant Varma: సుప్రీంకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ
సుప్రీంకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ
Yashwant Varma : కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సుప్రీంకోర్టు (Supreme Court) కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు.
ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) ఆరోపించారు. తనను పూర్తిస్థాయిలో, పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్‌ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని విచారణ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. ఇక, విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనదిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు.
ఈనెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను ఇటీవల చేపట్టారు. లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జస్టిస్ యశ్వంత్‌వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Justice Yashwant Varma – అసలు వివాదం ఏంటంటే ?
ఈ ఏడాది మార్చి 14న దిల్లీలోని జస్టిస్ యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా… ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్‌వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి.. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది.
అందులో… డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని నిర్ధరించింది. ఆ సొమ్ములున్న స్టోరూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబసభ్యుల అధీనంలోనే ఉందని పేర్కొంది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది. అసలు ఈ నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబసభ్యుల స్టోరూమ్‌లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడింది. కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మొత్తం కాదని వెల్లడించింది. అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌గా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని కమిటీ అభిప్రాయపడింది.
Also Read : CM Himanta Biswa Sarma: రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు
