Justice Yashwant Varma: జస్టిస్ వర్మ బదిలీకు కొలీజియం నిర్ణయం
జస్టిస్ వర్మ బదిలీకు కొలీజియం నిర్ణయం
Justice Yashwant Varma : అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయపటడి… అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna) నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల 20, 24వ తేదీల్లో సమావేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ తీర్మానాన్ని తన వెబ్‌సైట్లో పెట్టింది.
Justice Yashwant Varma Case
కేంద్రం ఆమోదించాక జస్టిస్ వర్మ(Justice Yashwant Varma) బదిలీ అమల్లోకి వస్తుంది. మరోవైపు దిల్లీ హైకోర్టు… జస్టిస్ వర్మను విధులకు దూరం పెట్టింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ వెలువరించిన ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సోమవారం కోర్టు ఒక నోటీసును విడుదల చేసింది.
జస్టిస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం చూడాల్సిన కేసులను జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్‌ల ధర్మాసనానికి అప్పగించారు. జస్టిస్ వర్మ నేతృత్వం వహించిన 3వ డివిజన్ బెంచ్‌ను జస్టిస్ ప్రతిభ ఎం సింగ్‌కు అప్పగించారు. అలహాబాద్ హైకోర్టుకు వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసించింది. మంగళవారం నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ వెల్లడించారు.
సీజేఐ స్పందనను ప్రశంసించిన ధన్‌ఖడ్
తాజా వివాదంపై రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సమావేశం నిర్వహించారు. సీజేఐ నియమించిన కమిటీ విచారణ నివేదిక వచ్చాక పూర్తి స్థాయిలో స్పందిద్దామని నిర్ణయించారు. ఈ ఘటన విషయంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించిన తీరును ధన్‌ఖడ్ ప్రశంసించారు.
Also Read : Kunal Kamra: స్టూడియోను కూల్చడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా ఆగ్రహం