Kangana Ranaut: ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు !
ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు !
Kangana Ranaut: మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల విషయంలో దాఖలైన ఓ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కంగనా రనౌత్ ను కోర్టు ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్… కాంగ్రెస్ పార్టీకు చెందిన విక్రమాధిత్య సింగ్ పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో తన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్‌వాసి లాయక్ రామ్ నేగి హైకోర్టును ఆశ్రయించారు. ఆ సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారని, ఒకవేళ నామినేషన్ ను ఆమోదించి ఉంటే తానే ఈ ఎన్నికల్లో గెలుపొందేవాడినని, కాబట్టి కంగనా రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.
Kangana Ranaut …
ఈ సందర్భంగా అటవీ విభాగంలో పనిచేసిన తాను… ముందస్తుగానే ఉద్యోగవిరమణ చేసినట్లు లాయక్ రామ్ నేగి తన వ్యాజ్యంలో తెలిపారు. నామినేషన్ పత్రాలతో పాటే డిపార్ట్‌మెంట్ నుంచి పొందిన ‘నో డ్యూ సర్టిఫికెట్’ను జత చేసినట్లు వెల్లడించారు. కానీ, విద్యుత్తు, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లు తెలిపారు. అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోగా తాను అన్నీ తీసుకెళ్లినట్లు చెప్పారు. వాటిని తీసుకోకపోగా… తన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. నామపత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్ నేగి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ రనౌత్‌ను కోర్టు ఆదేశించింది. ఆగస్టు 21లోగా స్పందనను తెలియజేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిపై ఎంపీ కంగనా ఎలా స్పందిస్తో వేచిచూడాలి.
Also Read : Ex CM KCR : ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగిన మాజీ సీఎం