Konathala Ramakrishna: జనసేనలోని మాజీ మంత్రి కొణతాల ! సాదర స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ !
జనసేనలోని మాజీ మంత్రి కొణతాల ! సాదర స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ !
Konathala Ramakrishna: మాజీ మంత్రి, సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనకాపల్లి వేదికగా ఆదివారం నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచకపాలన అంతమొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్రాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని… ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు.
ఈ నేపథ్యంలో తాను జనసేనలో చేరి పార్టీ, రాష్ట్రాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తామన్నారు. కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) ఇటీవల హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. 2014లో వైసీపీకు రాజీనామా చేసిన కొణతాల… ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో అనకాపల్లితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో కొత్స ఉత్సాహం నెలకొంది.
Konathala Ramakrishna- కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం: పవన్ కళ్యాణ్
కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం మంచి పరిణామం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడాయన. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు రామకృష్ణ సేవలు దోహదమవుతాయి’’ అని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : Sania Mirza : సానియా విడాకులపై స్పందించిన సోదరి..అండగా ఉండాలంటున్న కుటుంబ సభ్యులు