KTR: రైతుల ఆత్మహత్య విషయంలో ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ !
రైతుల ఆత్మహత్య విషయంలో ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ !
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విరుచుకుపడ్డారు. రుణమాఫీ అందక అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ట్విట్టర్ వేదిక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. రుణమాఫీ కాలేదని కొందరు రైతులు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమన్నారు. పెట్టుబడి సాయం లేక మరికొందరు ప్రాణాలు వదిలారని చెప్పారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రాణాలు తీస్తోందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా బోగస్ అని పేర్కొన్నారు. డిసెంబర్ లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలు కాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.
KTR Comment
అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్ లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడన్నారు. నేడు… మరో రైతు రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. తన పేరిట ఉన్న లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రుణంలో ఏ ఒక్కరి రుణం మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయాడని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలన్నారు. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకోవద్దని.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను అంటూ కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు.
Also Read : Stock Trading Scam: వేల కోట్ల ట్రేడింగ్ స్కామ్ లో ప్రముఖ నటి అరెస్టు !