Leaders Values Comment : వ‌ల‌స‌ల జాత‌ర విలువ‌ల‌కు పాత‌ర

నేత‌ల ఆయా రాం గాయా రాం

Leaders Values Comment : ఒక‌ప్పుడు ఎన్నిక‌లు నీతికి, న్యాయానికి, ధ‌ర్మానికి ప్ర‌తీకగా ఉండేవి. కానీ రాను రాను ఎల‌క్ష‌న్స్ ఆధిపత్య పోరాటానికి, డ‌బ్బులు, మ‌ద్యం పంపిణీకి , దౌర్జ‌న్యాల‌కు, దాడుల‌కు కేరాఫ్ గా మారాయి. ఇదంతా ప‌క్క‌న పెడితే ఇప్పుడు గెల‌వ‌డ‌మే ప్ర‌ధానంగా మారింది. దానినే ప్రాతిపదిక‌గా చేసుకుని ముందుకు వెళుతున్నారు ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు. క‌ట్ట‌డి చేయాల్సిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం చోద్యం చూస్తోంది. ఒక ర‌కంగా ఎన్నిక‌ల పండుగ చివ‌ర‌కు నేత‌ల‌కు త‌మను తాము ప్రూవ్ చేసుకునే స్థాయికి తీసుకు వెళ్లేలా చేసింది. ఈ దేశంలో ఎన్నిక‌ల సంఘం అనేది ఒక‌టి ఉంద‌ని , దానికంటూ ప‌వ‌ర్స్ ఉంటాయ‌ని, అది క‌న్నెర్ర చేస్తే అభ్య‌ర్థుల‌కు క‌ష్ట‌మేన‌ని తెలియ చేసింది ఒకే ఒక్క‌డు , త‌మిళ‌నాడుకు చెందిన దివంగ‌త సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి టీఎన్ శేష‌న్.

Leaders Values Comment Viral

ఆయ‌న బ‌తికి ఉన్నంత వ‌ర‌కు భ‌యం భ‌యంతో బ‌తికారు ఈ దేశంలోని నేత‌లంతా. కానీ ఎప్పుడైతే శేష‌న్ లేకుండా పోయారో ఆనాటి నుంచి నేటి దాకా ఎన్నిక‌ల సంఘం ఒక ప్ర‌హ‌స‌నంగా మారి పోయింది. చివ‌ర‌కు త‌మ‌కు అనుకూలంగా ఉండే ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌భావితం చేసేలా కేంద్రంలో కొలువు తీరిన స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఈ స‌మ‌యంలో ఇటీవ‌లే హ‌డావుడిగా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నియామ‌కంపై భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సీరియ‌స్ కామెంట్స్ చేసింది. సీఈసీ ఒకానొక ద‌శ‌లో ప్ర‌ధాన మంత్రిని, అవ‌స‌ర‌మైతే రాష్ట్ర‌ప‌తిని సైతం నిల‌దీసేలా, ప్ర‌శ్నించేలా ఉండాల‌ని కానీ అయ్యా ఎస్ అనేలా ఉండ కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు పార‌దర్శ‌కంగా ఉండాల‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాల‌ని, ఈ దేశ భ‌విష్య‌త్తు మీపై ఉంద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు అత్యున్న‌త న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య చంద్ర‌చూడ్.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ , బీజేపీ(BJP), త‌దిత‌ర పార్టీల నుంచి జంపింగ్ జ‌పాంగ్ లు ఎక్కువై పోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా పార్టీలు మారుతున్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేస్తున్నారు. వీరిని చూసి వీరేనా తాము ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు అంటూ ఆవేద‌న చెందుతున్నారు ప్ర‌జ‌లు. కేవ‌లం అధికార‌మే ల‌క్ష్యంగా, ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా మారిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జా సేవ అన్న‌ది గాలిలో దీపం లాగా మారింద‌న్న‌ది వాస్త‌వం. విలువ‌లు లేని, నిబ‌ద్ద‌త కాన‌రాని, ఇసుమంత ప్ర‌జ‌ల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ప్రేమ లేని ఈ నేత‌లు చ‌ట్ట స‌భ‌ల్లో కూర్చుంటే ఏం జ‌రుగుతుంది. ఐదేళ్ల పాటు భ‌రించ‌డం త‌ప్ప‌. నోటుకు, మ‌ద్యానికి బానిసై విలువైన ఓటును అమ్ముకుంటే మిగిలేది భ‌విష్య‌త్తు నాశ‌న‌మే. జీవితం శూన్య‌మేన‌ని తెలుసుకోవాలి.

Also Read : Kodanda Ram : కాంగ్రెస్ కు కోదండ‌రామ్ మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!