Mamata Banerjee: కనీసం 200 స్థానాల్లో గెలవండంటూ బీజేపీకు మమతా సవాల్ !
కనీసం 200 స్థానాల్లో గెలవండంటూ బీజేపీకు మమతా సవాల్ !
Mamata Banerjee: మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీజేపీకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కనీసం 200 నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చూపించాలని బీజేపీకు ఆమె సవాల్ విసిరారు. అబద్దాలు, గొబెల్స్ ప్రచారంతో బీజేపీ నెట్టుకొట్టుందని ఆమె ఆరోపించారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేయబోమని ఉద్ఘాటించిన దీదీ… సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారతారని హెచ్చరించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Mamata Banerjee Challenge
‘400లకుపైగా స్థానాల్లో గెలుస్తామని భాజపా చెబుతోంది. కనీసం 200 మార్కు దాటమని చెప్పండి. సవాల్ విసురుతున్నా. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200లకుపైగా సీట్లలో గెలుస్తామని చెప్పారు. కానీ, 77 దగ్గరే ఆగిపోయారు’ అని మమతా బెనర్జీ(Mamata Banerjee) పేర్కొన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సీపీఎం, కాంగ్రెస్ లపైనా దీదీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలూ బీజేపీతో చేతులు కలుపుతున్నాయని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ‘ఇండియా ’కూటమి లేదన్నారు. పౌరసత్వం ఉన్నవారిని విదేశీయులుగా మార్చేందుకు సీఏఏ ఒక మార్గమని బెంగాల్ సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను అనుమతించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసారు.
Also Read : Arvind Kejriwal: జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలిచ్చిన కేజ్రీవాల్ !