Mamata Banerjee: నేను రాజీనామాకు సిద్ధమే – సీఎం మమతా బెనర్జీ

నేను రాజీనామాకు సిద్ధమే - సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee: బెంగాల్‌ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్‌ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్‌ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మమత(Mamata Banerjee) అన్నారు.

సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు. ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా… తమ ప్రభుత్వం జూనియర్‌ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇస్తున్నాను అని ఆమె స్పష్టం చేసారు.

ఆర్‌.జి.కర్‌ మెడికల్‌ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌ హత్యాచారంతో జూనియర్‌ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డాక్టర్లు చేపట్టిన సమ్మె నెల రోజులకు పైగా సాగుతుండటంతో… రోగుల పరిస్థితి దృష్ట్యా సెప్టెంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని జూడాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే వారు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత(Mamata Banerjee) సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్‌ చేయగా.. బెంగాల్‌ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహ్వానించింది.

అయితే ఈ సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనితో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) సంప్రదింపులకు గురువారం సచివాలయం వరకూ వచ్చిన జూనియర్‌ వైద్యుల ప్రతినిధులు సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. సీఎంతో భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వారి డిమాండ్‌ ను ప్రభుత్వం అంగీకరించకపోవడం చర్చల ప్రారంభానికి అవరోధంగా మారింది. దీంతో అసహనానికి గురైన మమతా బెనర్జీ.. ప్రజల కోసం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానంటూ విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల జూనియర్‌ వైద్యులు డిమాండు చేసినట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేం. కానీ, వీడియో రికార్డింగ్‌ చేయడం కోసం ఏర్పాట్లు చేశాం. డాక్టర్లు విధులకు దూరంగా ఉండటంతో ఇప్పటి వరకూ 27మంది మృతిచెందారు. లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులపై ఎటువంటి చర్యలు తీసుకోబోం. మేం పెద్దవాళ్లం కాబట్టి చిన్నవాళ్లను క్షమిస్తాం’ అంటూ మమత వ్యాఖ్యానించారు. అనంతరం సచివాలయం నుంచి వెళ్లిపోయారు.

Mamata Banerjee – రెండుగంటలు వేచిచూశా – సీఎం మమత

సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత(Mamata Banerjee) అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌ కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే… చర్చల రికార్డింగ్‌ కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్‌ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్‌ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్, డీజీపీ రాజీవ్‌ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి.

రాజకీయ ప్రేరేపితం – సీఎం మమత

చర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు.

మమత రాజీనామా కోరలేదు: జూడాలు

ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్‌ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు.

Also Read : Jupudi Prabhakar Rao: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమాలు తప్పవు !

Leave A Reply

Your Email Id will not be published!