Mission 2024 Comment : సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే దేశమంతటా ఎన్నికల ఫీవర్ మొదలైంది. భారతీయ జనతా పార్టీని నిలువరించేందుకు పావులు కదుపుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. ఆయా పార్టీలు ఇప్పటి దాకా ఒకే స్టాండ్ మీద ఉన్న దాఖలాలు తక్కువ.
ఎక్కడికక్కడ బీజేపీ కట్టుదిట్టం చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో బలమైన వ్యవస్థను కలిగిన కాషాయాన్ని ఢీకొనడంలో విపక్షాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నది వాస్తవం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఆయా రాష్ట్రాలలో తిరుగుబాటు చేసిన వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేక పోతోంది. నిరంతరం ప్రశ్నల వర్షం కురిపిస్తూ వస్తున్న ఆ పార్టీకి చెందిన మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటుకు గురయ్యారు. ఇక బీజేపీయేతర రాష్ట్రాలు, నాయకులు , పార్టీలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. నిత్యం కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో సతమతం అవుతున్నాయి.
ఇదే క్రమంలో కాంగ్రెస్ కు సైతం ఈడీ బెడద తప్పలేదు. స్వయంగా సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసులో హాజరయ్యారు. ఇదంతా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదంటూ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ తన బలాన్ని పుంజు కోగలిగింది. దీని వెనుక అస్సాం సీఎం కీలక పాత్ర పోషించారు.
మరో వైపు బీహార్ లో నితీశ్ కుమార్ , తమిళనాడులో ఎంకే స్టాలిన్ , కేరళలో పినరయ్ విజయన్ , ఛత్తీస్ గఢ్ లో భూపేష్ బఘేల్ , జార్ఖండ్ లో సోరేన్ కీలకంగా ఉన్నారు. ఇక ఏపీలో జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ లు బీజేపీకి బిటీంగా పని చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, పంజాబ్ లో భగవంత్ మాన్ , ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లు సైతం ఎక్కడ ఉంటారనేది ఇంకా తేలడం లేదు. వీరందరిని ఒకే తాటిపైకి తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చారు అపారమైన అనుభవం కలిగిన నితీశ్ కుమార్. ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆయన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. అందరికంటే ముందు కలిపేందుకు ముందుకు వచ్చారు నితీశ్ కుమార్.
ఆయన ఒకే ఒక నినాదం అందుకున్నారు. ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఏ పార్టీ అయినా సరే బీజేపికి వ్యతిరేకంగా ఒక్కరిని మాత్రమే నిలబెట్టాలని మిగతా వారంతా సపోర్ట్ చేయాలని సూచించారు(Mission 2024).
ఈ స్లోగన్ గన్ లాగా పని చేసిందనడంలో సందేహం లేదు. ఆయన ఏఐసీసీ చీఫ్ ఖర్గే , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారు. పనిలో పనిగా రాహుల్ గాంధీతో చాలా సేపు చర్చించాక తాను పీఎం రేసులో లేనని ప్రకటించారు. అయితే తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందకు అన్ని పార్టీలు మహా కూటమి కిందకు రావాలని స్పష్టం చేశారు.
ఇక ఆ పార్టీతో విభేదిస్తూ వచ్చిన ఎస్పీ, బీఎస్పీల బాధ్యతను తన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు అప్పగించారు. ఇక మరాఠా విషయానికి వస్తే శివసేన మిత్రపక్షంగా ఉంది. ఇక శరద్ పవార్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియడం లేదు. ఆయన పాత్ర కీలకమైనప్పటికీ అనుమానాస్పదంగా ఉంది.
మొత్తంగా రాహుల్ గాంధీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు నితీశ్ కుమార్. రాజకీయ పరంగా అపర చాణక్యుడిగా పేరొందిన బీహార్ సీఎం తన మదిలో ఏముందో ఇప్పటికీ చెప్పలేదు. రాబోయే కూటమి ఏర్పాటైనా కింగ్ పిన్ ఎవరు(Mission 2024 Comment) ఉంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : అదానీ మోసం మోదీ మౌనం – రాహుల్