MLA Prashanthi Reddy: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు
ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు
MLA Prashanthi Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై… మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనితో ప్రసన్నకుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో పాటు వేంరెడ్డి కుటుంబ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ… అతని ఇంటిపై దాడి చేసారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో ప్రశాంతిరెడ్డి తెలిపారు.
MLA Prashanthi Reddy Complaint
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (MLA Prasanthi Reddy) మీడియాతో మాట్లాడుతూ… ప్రసన్న కుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో ధూషణలు చేశారని ఫైర్ అయ్యారు. తాను ఏఎస్పీకి ప్రసన్న కుమార్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని.. పోలీసులు చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని ప్రశాంతి రెడ్డి కోరారు. జగన్ పార్టీ నీచసంస్కృతికి తెరదీసిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. తనపై ప్రసన్న కుమార్ రెడ్డి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. మహిళలందరినీ వైసీపీ నేతలు దారుణంగా కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నారని విమర్శించారు. భర్త చనిపోయిన తాను, అత్తవారింట్లో అందరి అనుమతితో ఎంపీ వేమిరెడ్డిని వివాహం చేసుకున్నానని తెలిపారు. ఎన్నికల సమయం నుంచి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.
అప్పటి నుంచి కోవూరు మహిళాలోకం తన వెంట అండగా నిలిచిందని ఉద్ఘాటించారు. చెల్లెలు వరుసయ్యే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ (YCP) నేతలకి చెల్లెళ్లని గౌరవించే సంస్కారం లేదని దుయ్యబట్టారు. మహిళలని కించపరుస్తూ, వారి మానసిక స్థైరాన్ని దెబ్బతీసేందుకు జగన్ పార్టీ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. మహిళలపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జగన్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ మహిళలకి అన్నిరంగాల్లో 33శాతం రిజర్వేషన్లు ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళలు ఎదగకూడదనే పగతోనే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ నెల్లూరు పర్యటన సక్సెస్ కావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోయారని... ఆ వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి తనపై దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలపై పవన్, లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ (YCP) కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ (మంగళవారం) ఏపీ సచివాలయంలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకి ఒక అలవాటుగా మారిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
ప్రసన్న మాటలకి సభ్యసమాజం సిగ్గుపడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగత జీవితాలని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని చెప్పారు. ప్రసన్న వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్టప్రకారం కఠినంగా చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీ నేతలు నోటి దురుసుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నిండు శాసనసభలో కూడా అదేవిధంగా మాట్లాడటంతో వైసీపీ నేతలకి ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని గుర్తుచేశారు. అయినప్పటికీ నోటి దురుసు ఇంకా వదల్లేకపోతున్నారని ధ్వజమెత్తారు. మన సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వైసీపీ (YCP) నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా అని ఏపీ (AP) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని.. మంచి నడవడిక కూడా ఉండాలని సూచించారు. మహిళలపై అభ్యంతరకర మాటలు మాట్లాడటానికి వైసీపీ నేతలకు కనీస ఇంగితజ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు మంత్రి నారా లోకేష్.
మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణమని హెచ్చరించారు. తల్లి, చెల్లిని తరిమేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళల జోలికి వచ్చినా, ఆడవారిపై అవాకులు, చెవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదని వార్నింగ్ ఇచ్చారు. మహిళలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం తమదని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.
Also Read : Roman Starovoit: రష్యా మంత్రి ఆత్మహత్య ! పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే ఘటన !
