MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థులపై తెలంగాణా కాంగ్రెస్ కసరత్తు
ఎమ్మెల్సీ అభ్యర్థులపై తెలంగాణా కాంగ్రెస్ కసరత్తు
ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆశావహుల జాబితాను పరిశీలించడంతోపాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్ గా మారింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లు సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. ఎంపికపై ఈ నెల 7న రాత్రి లేదా 8న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా మూడు కాంగ్రెస్ కు, ఒకటి బీఆర్ఎస్ కు వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎంతోపాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు నాలుగో సీటు లభించే అవకాశమున్నా, సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
ఎన్నికల హామీని గుర్తు చేస్తున్న సీపీఐ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ కోరింది. సీపీఐ అగ్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడినట్లు తెలిసింది. ఒకవేళ సీపీఐకి ఇస్తే ఆ పార్టీ తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థిని నిలిపే అవకాశముందని తెలుస్తోంది. ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి శారద, సరిత, పారిజాత, విజయ తదితరులు టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయని జీవన్ రెడ్డి తనకు ఎమ్మెల్యేల కోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని శాసనమండలికి పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోరని సమాచారం. మైనార్టీల నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న ఆలోచన కూడా ఉందని, ఇందులో భాగంగా ఆ వర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం జరిగిన సమావేశంలో ప్రాథమికంగానే చర్చ జరిగిందని, ఢిల్లీలో జరిగే భేటీలో సీట్లు ఖరారవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీఎం రేవంత్ నివాసానికి మీనాక్షి
త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సమావేశం బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సామాజికవర్గాల వారీగా… ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు పేర్లతో ప్రతిపాదనలను ఏఐసీసీకి పంపుతారని, అక్కడ తుది జాబితాను ప్రకటిస్తారని నేతలు వెల్లడించారు.