MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ !
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ !
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… తీహార్ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా… తాను చెప్పదల్చుకున్న విషయాల్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె అన్నారు. ఆమె చెప్పిన్నట్లుగానే… కాసేపటికే కవిత(MLC Kavitha) పేరిట నాలుగు పేజీలతో ఓ లేఖ విడుదలైంది. ‘నేను ఈ కేసులో బాధితురాలిని. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఆర్థికంగా ఎలాంటి లబ్ది నాకు చేకూరలేదు. సిబిఐ, ఈడి దర్యాప్తు కంటే మీడియా విచారణ రెండున్నర ఏళ్లుగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు.
నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానల్స్ లో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. నాలుగు పర్యాయాలు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించాను. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశాను. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. నన్ను భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారు.
MLC Kavitha Cas Updates
సాక్షులను బెదిరిస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు ?. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు అరెస్టు చేశారు. రెండున్నర ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడి నన్ను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పి నన్ను అరెస్ట్ చేసింది. 95% కేసులు అన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుంది. పార్లమెంటు సాక్షిగా బిజెపి నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి ‘నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతాం’అన్నారు.
ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయవ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాము. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారామె. అలాగే.. ఇది తప్పుడు కేసు. నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పాను. మిగతాది లేఖ ద్వారా తెలియజేస్తా అని కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాకు చెప్పారు.
Also Read : Lakshadweep: లక్షద్వీప్ లోక్ సభ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళల సమస్యలు !