Modi BBC Comment : మోడీ బీబీసీ డాక్యుమెంట‌రీ క‌ల‌క‌లం

అన్ని లింకులు బ్లాక్ చేయాలంటూ ఆదేశం

Modi BBC Comment : అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ సంచ‌ల‌న కథ‌నం ఇప్పుడు వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సంబంధించి రెండు విభాగాలుగా డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. సోష‌ల్ మీడియాలో టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. దీనిపై కేంద్ర స‌ర్కార్ భగ్గుమంటోంది. న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో 2002లో చోటు చేసుకున్న అల్ల‌ర్ల‌కు ఆయ‌నే బాధ్యుడు అనే అర్థం వ‌చ్చేలా బీబీసీ ప్ర‌స్తావించ‌డం ఈ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

ఆనాటి గుజ‌రాత్ గోద్రా అల్ల‌ర్ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది. మోడీకి ఆయ‌న ప‌రివారానికి క్లీన్ చిట్ ఇచ్చింది. దేశంలో ప్ర‌స్తుతం మోదీ హ‌వా కొన‌సాగుతోంది. దీనిని అడ్డుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

మ‌రో వైపు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను మేలుకొల్పేలా చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజ‌రాత్ లో బీజేపీకి భారీ విజ‌యం ద‌క్క‌గా అధికారంలో ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌వ‌ర్ కోల్పోయింది. ఇక ఢిల్లీ బ‌ల్దియా ఎన్నిక‌ల్లో 15 ఏళ్ల పాటు సాగిన అధికారానికి చెక్ పెట్టింది ఆప్.

ఇక త్వ‌ర‌లో దేశంలోని 9 రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం మూడు రాష్ట్రాల‌కు సంబంధించి ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. మ‌రో వైపు ఈ రాష్ట్రాల‌లో జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌ను రాబోయే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్ గా భావించాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా.

మ‌రో వైపు జీ20 గ్రూప్ కు భార‌త్ నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా బీబీసీ రూపొందించిన డాక్యుమెంట‌రీ(Modi BBC) ఉందంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

అన్ని సామాజిక మాధ్య‌మాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆ లింకుల‌ను పూర్తిగా తొల‌గించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి ట్వీట్ చేసిన ఎంపీ డెరిక్ ఓ బ్రెయిన్ కు చెందిన ట్వీట్ ను కూడా తొలగించింది. బీబీసీ డాక్యుమెంట‌రీలో భార‌త దేశంలోని ముస్లిం జ‌నాభా ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి మోడీ అనుస‌రిస్తున్న విధానాన్ని ఎత్తి చూపింది.

ఇందుకు బీబీసీ పెట్టిన పేరు ఇండియా – ది మోడీ క్వ‌క్ఛ‌న్. ఈ సీరీస్ కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. రెండు భాగాల సీరీస్ లో మొద‌టి ఎపిసోడ్ జ‌న‌వ‌రి 17న టెలికాస్ట్ చేసింది. రెండో ఎపిసోడ్ జ‌న‌వ‌రి 24న ప్ర‌సారం కానుంది.

దీనిపై విదేశాంగ మంత్విత్వ శాఖ ప్ర‌తినిది అరింద‌మ్ బాగ్చి అభ్యంత‌రం తెలిపారు. ప‌క్ష‌పాతం, నిష్పాక్షిక‌త లేక పోవ‌డం, నిరంత‌ర వ‌లస మ‌న‌స్త‌త్వం స్ప‌ష్టంగా క‌నిపిస్తాయ‌ని పేర్కొన్నారు. అన్ని లింకుల‌ను బ్లాక్ చేయాల‌ని ఆదేశించ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని హరించ‌డ‌మేన‌ని ప్ర‌తిప‌క్షాలు పేర్కొంటున్నాయి.

Ravish Kumar Comment : త‌ల‌వంచ‌ని త‌త్వం ధిక్కార ప‌తాకం

Leave A Reply

Your Email Id will not be published!