మన్ కీ బాత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అత్యంత జనాదరణ కలిగిన కార్యక్రమంగా పేరు పొందింది. ప్రపంచంలోనే ఏ దేశ ప్రధానమంత్రి చేయని విధంగా భారత పీఎం నరేంద్ర దామోదర దాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం అభివృద్ది మంత్రం జపిస్తూ టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ప్రధానమంత్రి. భారత దేశానికి 75 ఏళ్లయింది స్వతంత్రం వచ్చి. గతంలో ప్రధానులు రేడియో మాధ్యమం ద్వారా ప్రసంగించే వారు. కానీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే 2014లో ప్రధానమంత్రిగా కేంద్రంలో కొలువు తీరారో ఆనాటి నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నరేంద్ర మోదీ.
రోజు రోజుకు వయసు పెరుగుతున్నా నిత్యం యవ్వనత్వంతో ముందుకు సాగుతున్నారు. దేశానికి కావాల్సింది చోదక శక్తితో కూడుకున్న యువత, ప్రజలేనని నమ్ముతారు. గతంలో వివేకానందుడు ప్రియమైన సోదర సోదరీమణులారా అని సంబంధిస్తే నరేంద్ర మోదీ మాత్రం తనదైన శైలిలో ప్రజలను పలకరించడం, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడం చేశారు. ఇది ఆయనను ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టేలా చేసింది. ప్రస్తుతం మోదీ ప్రపంచంలో టాప్ లీడర్లలో ఒకరుగా ఉన్నారు.
మన్ కీ బాత్ పేరుతో దేశంలోని స్పూర్తి దాయకమైన వ్యక్తులను పరిచయం చేశారు ప్రధాని. ఈ కార్యక్రమం అక్టోబర్ 3, 2014లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభమై ఏప్రిల్ 30, 2023 నాటికి 100 కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున మన్ కీ బాత్ పేరుతో జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తోంది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 100 మందిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చేపడుతోంది. ప్రత్యేక నాణేలు, పోస్టల్ స్టాంపులు కూడా విడుదల చేయనున్నారు.
ఇక మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగారు. స్పూర్తి దాయకమైన కథలను, వ్యక్తులను, విజయాలను పరిచయం చేశారు. సవాళ్లను అధిగమించి సక్సెస్ అయిన వారి గురించి ప్రస్తావించారు. ఈ మన్ కీ బాత్ ద్వారా వేలాది మంది వెలుగులోకి వచ్చారు. ఇక స్వీయ ప్రేరణతో సమాజానికి విశేష కృషి చేసిన సుమారు 500 మంది వ్యక్తులను, 250 సంస్థలను ప్రధాని ప్రస్తావించారు. వీరిలో 105 మంది స్పూర్తి దాయక వ్యక్తులు ఈ సమ్మేళనంలో పాల్గొననున్నారు. రెండు పుస్తకాలను ఆవిష్కరిస్తారు. రైళ్లలో ప్రయాణం చేసే వారు సైతం వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రవీనా, అమీర్ ఖాన్ , కిరణ్ బేడీ, దీపా మాలిక్ , ధీమంత్ పరేఖ్ , నిఖత్ జరీన్ , పూర్ణా మలవత్ హాజరు కానున్నారు. వీరితో పాటు రీకే కేజ్ , జగత్ కఖబ్వాలా, సిద్దార్థ్ కన్నన్ , రోచ్మలియానా, పాల్కీ శర్మ పాల్గొంటారు. సంజీవ్ భిక్ చందానీ, ఆర్జే రౌనక్ , మోహన్ దాస్ పాయ్ , రవి కుమార్ నారా, దాల్ లేక్ టోస్ , అబ్బాస్ భట్ , కరిష్మా మెహతా కూడా ఉన్నారు. మొత్తంగా ఈ మన్ కీ బాత్ మోదీని అత్యున్నత స్థానంలో నిలబెట్టేలా చేసింది.