Mohan Bhagwat: మోదీ పదవీ విరమణపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఆశక్తికర వ్యాఖ్యలు

మోదీ పదవీ విరమణపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఆశక్తికర వ్యాఖ్యలు

Mohan Bhagwat : 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలనే నిబంధనపై అనేక ఊహాగానాల నడుమ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్‌ లో తన 75వ పుట్టిన రోజు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ‘పదవీ విరమణ’ చేస్తారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదే అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు ఢిల్లీలో తేల్చి చెప్పారు. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) లోని అప్రకటిత ‘నియమం’ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజీనామా చేస్తారనే ఊహాగానాలను ఆర్‌ఎస్‌ఎస్ బాస్ తోసిపుచ్చారు.

Mohan Bhagwat Key Comments

ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi) సెప్టెంబర్ 17వ తేదీ నాటికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘నేను పదవీ విరమణ చేస్తానని, లేదా 75 ఏళ్లు నిండినప్పుడు మరొకరు పదవీ విరమణ చేయాలని నేనెప్పుడూ చెప్పలేదు’ అని ఆయన అన్నారు. ‘సంఘ్ మాకు ఏమి చెబుతుందో మేము అదే చేస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా చెప్పారు.

Mohan Bhagwat – ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలి – మోహన్‌ భాగవత్‌

సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న సమాజాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి భారతీయ కుటుంబం ముగ్గురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పిలుపునిచ్చారు. జనాభా స్థిరీకరణతోపాటు క్షీణతను నిరోధించడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఆరెస్సెస్‌ వందేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… మత మార్పిడిలు, చొరబాట్లు, హిందూ-ముస్లిం ఐక్యత, పలు రాష్ట్రాల్లో భాషా వివాదాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

‘‘సరైన వయసులో వివాహం చేసుకోవడం, ముగ్గురు పిల్లల్ని కనడం అనేది తల్లిదండ్రులకు, పిల్లలకూ ఆరోగ్యకరం. జనాభా పెరుగుదల ఓ వరమైనప్పటికీ… కొంత భారమే. అందరికీ ఆహారం సహా అన్ని వసతులు అందించాలి. జనాభా నియంత్రణ విధానం ఉన్నది అందుకే. ముగ్గురికంటే ఎక్కువ పిల్లలు ఉండకుండా జాగ్రత్త పడాలి. తద్వారా పెంపకంలో ఇబ్బందులు రావు. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూ ముగ్గురు పిల్లలు ఉండేలా కొత్త తరాలు చూసుకోవాలి’’ అని భాగవత్‌ పేర్కొన్నారు.

జనాభా సమతుల్యత సమస్యను ప్రతి దేశం ఎదుర్కొంటోందని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో మతమార్పిడిలు ఆందోళన కలిగిస్తున్నాయన్న ఆయన.. కొన్ని వర్గాల వారు కూడా ఇది మంచిది కాదని చెబుతున్నారన్నారు. చొరబాట్ల గురించి మాట్లాడుతూ.. డీఎన్‌ఏ ఒకటే అయితే అనుమతి తీసుకొని దేశంలోకి రావచ్చన్నారు. అక్రమంగా వస్తేనే సమస్యలు వస్తాయని చెప్పారు. చొరబాట్లను ప్రభుత్వాలు కొంతవరకే అడ్డుకోగలవని, వీరికి ఉపాధి కల్పించకుండా సామాన్యులు కూడా ప్రభుత్వాలకు సాయం చేయొచ్చన్నారు.

బీజేపీతో విభేదాల్లేవ్‌ – మోహన్‌ భాగవత్‌

బీజేపీ కోసం ఆరెస్సెస్‌ నిర్ణయాలు తీసుకుంటుందనేది వాస్తవం కాదని మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. భాజపా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. తాను పదవీ విరమణ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని, ఎవరినీ 75ఏళ్లకే రిటైర్‌ కావాలనీ చెప్పలేదన్నారు. తాను జీవితంలో ఎప్పుడైనా రిటైర్‌ కావచ్చని, సంఘ్‌ కోరుకున్నంత కాలం పని చేసేందుకు సిద్ధమేనన్నారు.

Also Read : Raghuram Rajan: ట్రంప్ టారిఫ్‌లపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!