MS Swaminathan Comment : మహనీయుడు హరిత పితామహుడు
నిత్య ప్రాతః స్మరణీయుడు
MS Swaminathan Comment : సమున్నత భారతావని శోక సంద్రంలో మునిగి పోయింది. కోట్లాది రైతుల బతుకుల్ని బాగు చేసిన ప్రాతః స్మరణీయుడు..హరిత విప్లవానికి ఆద్యుడు స్వామినాథన్ ఇక సెలవంటూ వెళ్లి పోయారు. సాగు రంగానికి ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ స్పూర్తి దాయకంగా ఉంటాయి. నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఈ దేశం గర్వించ దగిన మానవుడు. నిన్నటి తరానికి నేటి తరానికే కాదు రేపటి తరానికి కూడా ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని, ఎన్నో ఫలాలను మనకు అందించి పోయారు. ఇవాళ ఆ పితామహుడు లేక పోవడం దేశానికి తీరని లోటు..తీర్చని నష్టం కూడా. ఇలాంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు. తమ కృషితో , అపారమైన మేధస్సుతో ప్రత్యేకతను చాటుకుంటారు. అలుపెరుగని రీతిలో శ్రమించడమే కాదు జీవితం చరమాంకంలో కూడా దేశానికి అన్నం పెట్టే అన్నదాతల గురించి ఆలోచించిన మహనీయుడు ఎంఎస్ స్వామినాథన్. ఒకటా రెండా ఎన్నో వేల పరిశోధనలు చేశారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి సంబంధించి. ఆయన చేసిన కృషి వల్లనే ఇవాళ దేశం ఆకలి బాధల నుంచి తప్పించుకుంది.
MS Swaminathan Comment Viral
స్వామినాథన్ పూర్తి పేరు మంకొంబు స్వామినాథన్. ఆగస్టు 7, 1925లో పుట్టారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తగా అరుదైన ఘనత సాధించారు. అంతకు మించి మానవతావాదిగా పేరు పొందారు. ఏ పరిశోధన అయినా అది సమస్త మానవాళికి చెందినదై ఉండాలని నమ్మారు. విశ్వసించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఆయన ప్రతి నిమిషం సాగుకు సంబంధించి పరిశోధనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే హరిత విప్లవానికి ప్రపంచ నాయకుడిగా ఎదిగిన అరుదైన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan). అధిక దిగుబడులు ఇచ్చే గోధుమలు, వరి రకాల వంగడాలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. హరిత విప్లవానికి ఈ దేశంలో స్పూర్తి ప్రదాతనే కాదు వాస్తు శిల్పిగా పరిగణించ బడ్డారు. ఆనాడు నార్మన్ బోర్లాగ్ తో స్వామి నాథన్ కలిసి చేసిన ప్రయత్నాలు ఆరుగాలం కష్టపడే రైతులకు ఎంతో మేలు చేకూర్చేలా చేశాయి.
స్వామి నాథన్ కృషి కారణంగా 1960లో భారత దేశంతో పాటు పాకిస్తాన్ కరవు బారి నుండి కాపాడుకునే ప్రయత్నం చేశాయి. ప్రపంచ ఆహార బహుమతిని అందుకునేలా చేశాయి. ఐక్య రాజ్య సమితి స్వామినాథన్ ను ఆర్థిక జీవావరణ శాస్త్ర పితామహుడిగా కొనియాడింది. స్వామినాథన్(MS Swaminathan) బంగాళ దుంప, గోధుమ, బియ్యం, సైటోజెనెటిక్స్ , ఆయోనైజింగ్ రేడియేషన్ , రేడియో సెన్సిటివిటీ అంశాలపై పరిశోధనలు చేశారు. ప్రతిష్టాత్మకమైన టైమ్ ప్రకటించిన 20వ శతాబ్దపు అత్యంత ప్రభావంతమైన 20 మంది ఆసియా వ్యక్తుల జాబితాలో గాంధీ, ఠాగూర్ తో పాటు స్వామినాథన్ కూడా ఉన్నారు. రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నారు. ఫౌండేషన్ కూడా స్థాపించారు. తన జీవితమంతా ప్రజల కోసం , దేశం కోసం, రైతుల కోసం పాటుపడ్డారు. ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నారు స్వామినాథన్. సెప్టెంబర్ 28న కాలం చేశారు. స్వామి నాథన్ ఒక వ్యక్తి కాదు పేదలు, అన్నార్థుల పాలిట దేవుడు. ఆయన లేక పోవడం సమస్త మానవాళికి తీరని దుఖఃం, అపారమైన నష్టం కూడా.
Also Read : Minister KTR : కేసీఆర్ వల్లనే పరిశ్రమల రాక – కేటీఆర్