NIA: పహాల్గాం ఉగ్రదాడి ఆ మూడు సంస్థల పనే – ఎన్ఐఏ

పహాల్గాం ఉగ్రదాడి ఆ మూడు సంస్థల పనే - ఎన్ఐఏ

NIA : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)… లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థతోపాటు పాక్‌ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐల హస్తం ఉన్నట్టుగా తేల్చింది. పాక్‌ ఆర్మీ, ఐఎస్ఐల ఆదేశాల మేరకే… లష్కరే తాయిబా సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఈ దాడికి ప్రణాళిక రచించినట్టు అంచనా వేసింది. ఎన్‌ఐఏ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఈ వివరాలను పొందుపర్చినట్టు తెలిసింది. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థలు ఈ వివరాలను వెల్లడించాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా… ఉగ్రవాదులకు స్థానికంగా సహకారం అందించిన పలువురిని ఎన్‌ఐఏ(NIA) అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పహల్గాం(Pahalgam) ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు హష్మి మూసా (అలియాస్‌ సులేమాన్‌), అలీభాయ్‌ (అలియాస్‌ తల్హా భాయ్‌)… పాకిస్థాన్‌ లోని ఉగ్రవాద నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా గుర్తించింది.

NIA – ఘటనా స్థలం త్రీడీ మ్యాపింగ్‌

ఉగ్రదాడి జరిగిన బైసరన్‌ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికత ఆధారంగా ఎన్‌ఐఏ(NIA) పరిశీలన జరిపింది. మొత్తంగా 40 తూటా కాట్రిడ్జ్‌లను గుర్తించి, ఫోరెన్సిక్‌ రసాయన విశ్లేషణకు పంపింది. లైడార్‌ పరిజ్ఞానం, డ్రోన్ల వీడియోలు, శాటిలైట్‌ చిత్రాల సాయంతో ఘటనా స్థలం మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్‌ చేసి… ఉగ్రవాదులు రాక, దాడి, తిరిగి పారిపోయిన అంశాలపై ఆధారాలను సిద్ధం చేసింది. అదే సమయంలో ఘటనకు ముందు, తర్వాత బైసరన్‌, పరిసర ప్రాంతాల్లో శాటిలైట్‌ ఫోన్ల వినియోగం వివరాలను సేకరించింది. మొత్తం మూడు శాటిలైట్‌ ఫోన్లు వినియోగించినట్టు గుర్తించగా, ఇప్పటివరకు అందులో రెండింటి సిగ్నళ్లను గుర్తించి, విశ్లేషించింది. పహల్గాం ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ, ఇతర భద్రతా సంస్థలు కలిసి కుప్వారా, పుల్వామా, సపోర్‌, అనంత్‌నాగ్‌, బారాముల్లా తదితర జిలాల్లో విస్తృతంగా తనిఖీలు చేసి, 2,800 మందికిపైగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇందులో 150 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం. మరోవైపు దాడి చేసి పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. వారు దట్టమైన అడవుల్లో దాక్కున్నారని భద్రతా బలగాలు తెలిపాయి.

రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి – పాక్ ప్రభుత్వం

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) ప్రజలు రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ‘పహల్గాం’ నేపథ్యంలో భారత్‌ ఏ క్షణమైనా దాడికి దిగవచ్చనే ఆందోళనతో ఈ పిలుపునిచ్చింది. పీఓకే ప్రధాని చౌదరి అన్వరుల్‌ హాక్‌ శుక్రవారం స్థానిక అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించినట్టు అరబ్‌ న్యూస్‌ వార్తాసంస్థ తెలిపింది. ముఖ్యంగా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు ఇప్పటికే ఈ సూచన చేసినట్టుగా అన్వరుల్‌ చెప్పారని.. ఆహారం, మందులు, ఇతర అవసరాల కోసం వంద కోట్ల పాక్‌ రూపాయలతో అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారని వెల్లడించింది.

Also Read : Goa Temple Stampede: గోవా లైరాయ్‌ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు భక్తులు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!