న్యాయ వ్యవస్థను ఎవరూ భయపెట్టలేరు : సీజేఐ

ఇండియా కూట‌మి నేత‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సూర్య‌కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఎవ‌రూ భ‌య‌పెట్ట‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. ఇది తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ప్రాంగణానికి చేరుకుని నిరసన తెలపడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్య‌వ‌స్థ ఎలా ప‌ని చేయాలో, ఏం చేయ‌కూడ‌దో, ఎలా తీర్పులు ఇవ్వాల‌నేది ఎవ‌రూ నేర్పించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు సీజేఐ. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ , ఇండియా కూటమికి చెందిన ఇతర నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ , ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు జారీ చేసినంత మాత్రాన రాజకీయ నాయకుల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది. మేము నోటీసులు జారీ చేస్తున్నాం, కానీ తదుపరి విచారణ నాటికి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన నిరసన అంశాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా , న్యాయవాది గౌరవ్ భాటియా కోర్టు దృష్టికి తీసుకు రావడంతో కోర్టు ఈ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ కోర్టు ప్రాంగణంలో రాజకీయ ప్రదర్శనలు జరగడం అంగీకార్యం కాదు. సుప్రీంకోర్టులో జరిగిన ఘటన జరగకూడనిది అని గౌరవ్ భాటియా పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీజేఐ సూర్య‌కాంత్. న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఏ శ‌క్తి భ‌య‌పెట్టాల‌ని అనుకోవ‌డం మంచిది కాద‌న్నారు. ఈ నిరసనలు, ప్రదర్శనలు కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని భాటియా వాదించగా అటువంటి ప్రయత్నాలు చాలా బలహీనమైనవి అని కొట్టిపారేశారు. ఇవి ఎవరూ పట్టించుకోని బలహీనమైన ప్రయత్నాలు మాత్రమే. బయట వారు ఏవైనా ప్రకటనలు చేయవచ్చు… కానీ తాము ఏకాంత గోపురంలో (ఐవరీ టవర్) కూర్చోలేదు, బయట ఏం జరుగుతుందో మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your Email Id will not be published!