Layout Regularization Scheme: ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణా ప్రభుత్వం !
ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణా ప్రభుత్వం !
Layout Regularization Scheme: రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఆ మేరకు మార్గదర్శకాలు జారీచేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎం. దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.
Layout Regularization Scheme – ఎల్‌ఆర్‌ఎస్ కు 25 లక్షల దరఖాస్తులు !
స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020 నుంచి సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు ఉండటంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం… ‘కోర్టు తీర్పునకు లోబడతామంటూ’ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఉత్తర్వుల జారీతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఆయా దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ముందస్తుగా పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా స్క్రీనింగ్ చేస్తుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే… గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే… దానిపైనా సమాచారాన్ని పంపుతుంది. సీజీజీ స్క్రీనింగ్ అనంతరం మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్‌ప్లానింగ్, పంచాయతీ అధికారులబృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సీజీజీ రూపొందించిన సెల్‌ఫోన్ యాప్‌లో నమోదు చేస్తారు.
రెండో దశలో మరింత అధ్యయనం చేసి.. అర్హమైనవైతే నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీచేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో.. అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు. మూడోదశలో అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తారు. లేఅవుట్ల విషయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు.
ఎల్ఆర్ఎస్ నోటీసులకు సహాయ కేంద్రాల ఏర్పాటు !
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్‌లు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్(Hyderabad) మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయుల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read : Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ షాక్ !యుపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేదం !