Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సిందూర్"

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించింది. “ఆపరేషన్ సిందూర్” లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మిసైళ్ళ వర్షం కురిపించింది. ఈ మిసైళ్ళ దాడిలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిలో సుమారు 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అనేక మంది అగ్ర ఉగ్రవాద కమాండర్లు మరణించి ఉండవచ్చని భారత(India) సైన్యం అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh), ఇండియన్ ఆర్మీ… తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ల నుండి ట్వీట్ చేస్తూ దృవీకరించాయి.

పహల్గాం దాడికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించిన భారత్(India)… పాక్‌పై భీకర దాడుల ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(Kashmir)తో పాటు పాక్‌ లోని మూడు పలు ఉగ్రవాద శిబిరాలను భారత మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. లష్కరే తయ్యబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బలు ముజాహిద్దీన్, ఇతర ఉగ్రసంస్థల స్థావరాలు టెర్రర్ నెట్వర్క్‌లు ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపుదాడులకు దిగింది. బహావల్‌పూర్, మురిద్కే, కోట్లీ, గుల్‌పూర్, సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్‌మూనా ప్రాంతాలపై దాడి దాడులకు దిగింది. బహావల్‌పూర్‌లో జైష్ ఏ మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. మురిద్కే లో లష్కరే తయ్యబా శిక్షన క్యాంపు ఉంది. కోట్లీలో సూసైడ్ బాంబర్ల శిక్షణ కార్యక్రమాలు సాగుతుంటాయి. గుల్‌పూర్‌లో నుంచి ఉగ్రవాదులు తరచూ పూంచ్, రాజౌలీలపై దాడులకు దిగుతుంటారు. సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్‌మూనా వంటి ప్రాంతాలు ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి.

“ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)” లో భారత త్రివిధ దళాలు పాల్గొన్నాయి. దీర్ఘశ్రేణి ఆయుధాలతో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయి. ఈ దాడుల సమయంలో పాక్ పౌరులకు ఎలాంటి అపాయం లేకుండా జాగ్రత్తపడింది. పాక్ మిలిటరీ స్థావరాలపై కూడా దాడులు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి 1.44 గంటలకు దాడులు ప్రారంభించింది. అంతకు కొద్ది గంటల ముందే ఆర్మీ నేవీ అన్నింటికి రెడీ అంటూ ట్వీట్ చేశాయి. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్‌’ అంటూ భారత్‌ సైన్యం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఇవి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది.

Operation Sindoor  – సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్ర స్థావరాలే టార్గెట్‌ గా ‘ఆపరేషన్‌ సిందూర్‌’

అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్ర స్థావరాలనే భారత్‌ సైన్యం టార్గెట్‌ చేసింది. సరిహద్దుకు 100 కి.మీ దూరంలో బహవల్‌పూర్‌లో జైష్ -ఎ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ.దూరంలో లష్కరే క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడే 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్-రాజౌరికి 35 కి.మీ. దూరంలో గుల్పూర్‌ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్‌లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ. పరిధిలో సవాయి ఎల్‌ఈటీ క్యాంపు ఉంది. రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ దూరంలో ఎల్‌ఈటీ కోట్లి క్యాంపు ఉంది. ఇక్కడ దాదాపు 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ దూరంలో సియాల్‌ కోట్‌ సమీపంలో హెచ్‌ఎం శిక్షణ శిబిరం మొహమూనా క్యాంప్‌ ఉంది.

ఆపరేషన్‌ సింధూర్‌ – పాకిస్తాన్‌లో టెన్షన్‌

భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”తో పాకిస్తాన్‌ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడులపై అప్రమత్తమైన పాక్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు విమానాశ్రయాలు మూసివేశారు. లాహోర్‌, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. అంతేకాదు ఈ దాడులను ధృవీకరించిన పాకిస్తాన్‌… ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలు మూసివేత

‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’లో భాగంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు తెరవవద్దని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌ పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ పాకిస్థాన్‌ కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్‌ గగనతలం మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటించింది. పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ మొదటి ప్రాధాన్యని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు స్పైస్‌ జెట్‌ ప్రకటించింది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరులోనే మొత్తం మెసేజ్‌

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’ ను చేపట్టింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. దీనితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్‌ కు పెట్టిన పేరుతోనే పాక్‌ కు బలమైన సందేశం పంపింది.

ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి… వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రమూక టార్గెట్‌ చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్‌ నర్వాల్‌, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా… అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. వినయ్‌ నేవీ అధికారి కూడా. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. పురుషులను చంపడం ద్వారా హిందూ మహిళలు పరమ పవిత్రంగా భావించే సింధూరం బొట్టును ఉగ్రవాదులు తుడిచేసారు. దీనికి సూచికంగా ఈ దాడులకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గా నామకరణం చేసారు. మరోవైపు యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.

Also Read : Earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

Leave A Reply

Your Email Id will not be published!