Pahalgam Terror Attack: పహాల్గాం ఉగ్రదాడి దుష్ప్రచారంపై ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

పహాల్గాం ఉగ్రదాడి దుష్ప్రచారంపై ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

 

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. వీరంతా పాకిస్థాన్‌ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్నారు. వీరి గత చరిత్రను పరిశీలించి… నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ అరెస్టయిన వారిలో అసోం, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారన్నారు. వీరిలో ఎమ్మెల్యేతోపాటు విద్యార్థులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు సైతం ఉన్నారని వివరించారు. అలాగే 2019 పుల్వామా దాడి ఘటన నుంచి ఇటీవల చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి వరకు అన్ని ప్రభుత్వం కుట్రలంటూ ఆరోపణలు గుప్పించిన తమ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఇప్పటికే దేశద్రోహం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిపై మోదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశంతో చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఘటన తర్వాత సైన్యాన్నికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉగ్రదాడిని హిందువులపై జరిగిన దాడిగా చిత్రీకరించి… బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుదంటూ… కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాలు చేస్తూ… దేశ భద్రతకు ముప్పు కలిగించేలా పోస్టులు చేసిన వారిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి.

 

పహాల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్‌ బీజేపీ పోస్టర్‌ వార్‌

 

పహల్గాం ఉగ్ర దాడి ఘటనపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాకస్థాయికి చేరాయి. దీనిలో భాగంగా మంగళవారం ఇరు పార్టీల సోషల్ మీడియాలు పోస్టర్‌ యుద్ధానికి దిగాయి. పసుపు రంగు కుర్తా పైజామా, నల్లటి బూట్లు ధరించిన ప్రధాని చిత్రాన్ని తల లేకుండా కాంగ్రెస్‌ సోమవారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది. దాని కింద ‘బాధ్యత వహించాల్సిన సమయంలో మాయమయ్యారు’ అనే సందేశం పెట్టింది. దీనిని పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఫవాద్‌ చౌదరి రీట్వీట్‌ చేయడంతో బీజేపీ మంగళవారం… కాంగ్రెస్ పై విరుచుకుపడింది. రాహుల్‌గాంధీ పాకిస్థాన్‌ మిత్రుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ ట్వీట్‌ చేయడమేగాక… వీపు వెనుక కత్తి దాచుకుని ఉన్న రాహుల్‌ చిత్రాన్ని పోస్టు చేశారు. పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని పాల్గొనకపోవడంపై కాంగ్రెస్‌ తరచూ విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే తాజా పోస్టర్‌ను పోస్టు చేసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్‌ సంపూర్ణంగా పాకిస్థాన్‌కు మద్దతిస్తోందని… ఆ పార్టీని ‘లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్’గా అభివర్ణించింది.

 

అఖిల పక్ష సమావేశంలో ఐక్యత గురించి ఆ పార్టీ నొక్కిచెప్పిందని… కానీ ఆ పార్టీ నేతలు పాక్‌ తో చర్చలు జరపాలంటున్నారని ఆక్షేపించింది. ‘తలలేని మొండెం’… ఆ పార్టీ ఉగ్ర సిద్ధాంతంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ‘తలలేని ప్రధాని చిత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా పోస్టు చేసింది. తద్వారా భారత్‌ లో మీర్‌ జాఫర్‌ మద్దతుదారులున్నారని పాకిస్థాన్‌ కు గట్టి సందేశం పంపింది. రాహుల్‌ గాంధీ ఆదేశాలతోనే ఆ పోస్టు పెట్టారు. దీనిని చూసి దేశం సిగ్గుపడుతోంది. క్లిష్ట సమయంలో భారత్‌ను బలహీనపరిచేందుకు లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నమిది’ అని విమర్శించారు.

 

తలలేని మొండెం ఉగ్రవాద నినాదమని… ఆ పార్టీ పోస్టర్‌ దానినే ప్రతిబింబిస్తోందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికే కాంగ్రెస్‌ తలలేని మొండెం చిత్రాన్ని పోస్టుచేసిందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఈ వివాదంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు. ‘‘పార్లమెంటు చర్చల్లో ప్రధాని పాల్గొని పహల్గాం ఘటన తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరాం. ఇందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదు. ఐక్యతే కాంగ్రెస్‌ ఫార్ములా’ అని స్పష్టం చేశారు.

ఎట్టకేలకు పోస్టర్ తొలగింపు

తీవ్ర రాజకీయ దుమారం దరిమిలా ‘తలలేని ప్రధాని’ పోస్టర్‌ను ‘ఎక్స్‌’నుంచి కాంగ్రెస్‌ పార్టీ తొలగించింది. ఈ పోస్టర్‌పై కాంగ్రెస్‌ నాయకుల్లోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పార్టీ వైఖరికి భిన్నమైన పోస్టరుకు అనుమతించినందుకు పార్టీ సోషల్‌ మీడియా విభాగం సారథి సుప్రియ శ్రీనతేను కాంగ్రెస్‌ అధిష్ఠానం మందలించిందని, తక్షణం పోస్టరు తొలగించాలని ఆదేశించిందని అభిజ్ఞ వర్గాలు సమాచారం.

Leave A Reply

Your Email Id will not be published!