Pahalgam Terror Attack: నెత్తురోడిన కశ్మీరం ! మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో ఉగ్రదాడి !
నెత్తురోడిన కశ్మీరం ! మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో ఉగ్రదాడి !
Pahalgam Terror Attack : ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకోవడంతో అందాల కశ్మీరం ఎరుపెక్కింది. పచ్చదనం తివాచీ పరిచినట్లుండే కాశ్మీర్ లోయలు రక్తపు టేర్లుగా మారాయి. కాశ్మీర్(Kashmir) అందాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు.
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పహల్గామ్ హిల్ స్టేషన్(Pahalgam Terror Attack) లోని బైసారన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆర్మీ యూనిఫాంలో వచ్చిన పలువురు ఉగ్రవాదులు గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. దీనితో సందర్శకుల కేరింతలతో అప్పటి వరకూ సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తూటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేలకొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది.
Pahalgam Terror Attack – శ్రీనగర్ కు మృతదేహాలు
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బుధవారం పహల్గాం నుంచి శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. అక్కడ అధికారులు వీరికి నివాళులర్పించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కూడా మృతదేహాలకు అంజలి ఘటించనున్నారు. అనంతరం అక్కడ నుండి మృతుల స్వస్థలాలకు ప్రత్యేక విమానాల ద్వారా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉగ్రదాడిలో నవ వరుడు మృతి
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) ఆరు రోజుల క్రితం పెళ్లి చేసుకుని… హనీమూన్ కు వెళ్లిన కొత్త జంటకు తీవ్ర విషాదాన్ని నింపింది. భార్యతో కలిసి పానీపూరీ తింటున్న నవ వరుడుపై ఉగ్రవాదులు మతం అడిగి మరి దాడికి పాల్పడ్డారు. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ సందర్భంగా ఘటన స్థలంలో నవ వధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది. ‘‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లింకాదుకదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’’అంటూ ఆ మహిళ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఎస్‌ఐబీ సెక్షన్ అధికారి మనీశ్‌రంజన్ మృతి
కశ్మీర్‌లో(Kashmir) జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చిచంపినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెబుతున్నారు. బిహార్‌కు చెందిన మనీశ్…ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు.
2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు కాల్పులకు దిగి 47 మందిని పొట్టన పెట్టుకున్న అనంతరం కశ్మీర్ లో జరిగిన అతి పెద్ద దాడి పహల్గాంలో జరిగింది. దీనితో ఉగ్రవాదంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి తమ పనేనని పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా తాలూకు ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ప్రకటించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పార్టీలకు అతీతంగా నేతలంతా దాడిని ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రవాదులది మతిలేని ఉన్మాదమంటూ మోదీ మండిపడ్డారు.
ఉగ్రదాడిపై ప్రధాని మోదీ స్పందన
‘‘ఈ హేయమైన దాడికి పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదు. వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. ముష్కరుల కుటిల అజెండా ఫలించబోదు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు జరపాలన్న మా సంకల్పం మరింత బలపడింది’’ అని ప్రకటించారు. ‘‘మృతుల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులందరికీ అన్నివిధాలా సాయం అందజేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా జెడ్డా నగరంలో ఉన్న ఆయన విషయం తెలియగానే పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని భారత్ తిరిగొచ్చారు. అంతకుముందు సౌదీ నుంచే కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో మాట్లాడారు. అనంతరం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా తదితర ఉన్నతాధికారులు, ఢిల్లీలో ఉన్న జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరులతో షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) మంగళవారం రాత్రే ప్రత్యేక విమానంలో హుటాహుటిన కశ్మీర్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో పరిస్థితిని సమీక్షించారు. ‘‘తాజా పరిస్థితిని మోదీకి నివేదించారు. ఉగ్ర దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. దాడికి తెగబడ్డవారిని వదిలే ప్రసక్తే లేదు. వారి వెనకున్న సూత్రధారులను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తాం’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
క్షమించరాని ఘటన – రాష్ట్రపతి ముర్ము
‘పర్యాటకులపై కాల్పులు అత్యంత హేయమైన చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’.
మనుషులు కాదు మృగాలు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు. ఉగ్రదాడిని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు.
అమర్‌నాథ్ యాత్రను అడ్డుకునే కుట్ర ?
అమర్‌నాథ్ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజులపాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్ నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఈ మార్గాల్లో ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కి.మీ. దూరం ఉండగా, మరొకటి గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కి.మీ. దూరం ఉంటుంది.
Also Read : Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్
