Pariksha Pe Charcha 2025: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’కు చోటు

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’కు చోటు

Pariksha Pe Charcha 2025 : పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయాందోళన, ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ అరుదైన ఘనత సాధించింది. ఈ కార్యక్రమం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనత తనకు వ్యక్తిగతంగానూ ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన 8వ ఎడిషన్‌ ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha 2025) కార్యక్రమానికి నెల రోజుల్లోనే దాదాపు 3.53 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, 21 కోట్ల మందికి పైగా టీవీల్లో వీక్షించడంతో ఇది ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ చిరస్మరణీయ ఘనత సాధించిన వేళ ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలిపారు.

Pariksha Pe Charcha 2025 – Guinness Record

ఈ మేరకు దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్ సిబ్బంది ఈ సర్టిఫికెట్‌ను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. తాను క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న కాలంలో ఇది రెండో గుర్తింపు అని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తాను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2015 డిసెంబర్‌లో ఎల్పీజీ గ్యాస్‌ పంపిణీలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమంగా చేపట్టిన ‘పహల్‌’ పథకానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సర్టిఫికెట్‌ అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha 2025) ఒత్తిడి లేని, ఆనందకరమైన అభ్యాసం కోసం దేశ వ్యాప్తంగా ఓ పండుగలా మారిందన్నారు. పరీక్షల ఒత్తిడి తగ్గించడంతో పాటు వ్యక్తిగత పురోగతిని ప్రోత్సహించేలా ఈ విధానానికి రూపకల్పన చేసిన ప్రధాని మోదీకి హ్యాట్సాఫ్ అన్నారు. అలాగే, విద్యాసంబంధిత ఒత్తిళ్లను తగ్గించడంలో, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం చూపే లోతైన ప్రభావాన్ని గుర్తించినందుకు గిన్నిస్‌ వర్లడ్‌ రికార్డ్స్‌ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020 స్ఫూర్తిని అమలులోకి తీసుకొచ్చేలా పరీక్షా పే చర్చ ఏటా మరింత భారీగా, మెరుగ్గా ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. పీపీసీని తొలిసారిగా 2018 ఫిబ్రవరి 16న దిల్లీలో నిర్వహించగా.. అప్పట్నుంచి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు.

Also Read : Kodali Nani: కొడాలి నానిపై కేసు నమోదు!

Leave A Reply

Your Email Id will not be published!