Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మను తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ఎంపీల నోటీసు

జస్టిస్‌ వర్మను తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ఎంపీల నోటీసు

Justice Yashwant Varma: అగ్ని ప్రమాదంలో ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఈమేరకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్‌ సమర్పించారు. అదే విధంగా రాజ్యసభలోనూ 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించారు. కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన, ఏజీపీ, ఎల్‌జేఎస్‌పీ, ఎస్‌కేపీ, సీపీఎం మొదలైన పార్టీల ఎంపీలు ఈ మెమోరాండంపై సంతకాలు చేశారు. ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీపీ చౌదరి, సుప్రియా సులే, కేసీ వేణుగోపాల్ తదితరులు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (Justice Yashwant Varma) అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపినట్లు సమాచారం.

Justice Yashwant Varma Case Updates

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ తీర్మానాన్ని తెస్తామని గతంలోనే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది అతి సున్నితమైన, తీవ్రమైన అంశమని అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంటే అది ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే అంశమే కాబట్టి జస్టిస్‌ వర్మను తొలగించే విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని పేర్కొన్నారు.

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (Justice Yashwant Varma) ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా.. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్‌ వర్మకు సీజేఐ సూచించారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. అయితే న్యాయమూర్తుల కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనిదిగా పరిగణించాలని కోరుతూ జస్టిస్‌ వర్మ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Also Read : Captain RS Sandhu: ఎయిరిండియా విమాన దుర్ఘటనపై రంగంలోకి ఆర్‌ఎస్‌ సంధు!

Leave A Reply

Your Email Id will not be published!