పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : నారా లోకేష్
యాప్ వినియోగం పట్ల కార్యకర్తలకు ఘనంగా సత్కారం
మంగళగిరి : కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ అని స్పష్టం చేశారు. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడ వరకు రాగలిగారు. రేపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొంటారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుందన్నారు.
వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలని స్పష్టం చేశారు నారా లోకేష్. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నానని కానీ కార్యకర్తే అధినేత అన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో వరకు రాగలగాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను వివరించేందుకు 365 రోజులూ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం అని తెలిపారు. 2019-24 మధ్య జగన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కలవలేదు. మనం కార్యకర్తలను కలుస్తున్నాం అన్నారు.
