Pawan Kalyan: మండల స్థాయి వరకు పార్టీను మానిటర్ చేస్తా – పవన్ కల్యాణ్
మండల స్థాయి వరకు పార్టీను మానిటర్ చేస్తా - పవన్ కల్యాణ్
Pawan Kalyan : జనసేన సిద్ధాంత ఆధారిత పార్టీ అని… అందుకే ఆలస్యం అయిన వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించిందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అందరిలాగే తాను కూడా కష్టాల కొలిమి నుంచే వచ్చానని… ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొని నిలదొక్కుకున్నామన్నారు. ఇంత మంది ఎమ్మెల్యేలతో నిలబడేందుకు తనకు పుష్కర కాలం పట్టిందన్నారు. పదవి, అధికారం అనే ఆశ లేకుండా మన దేశం, మన మూలాలను పరిరక్షించుకోవాలనే సంకల్పం కార్యకర్తలకు ఉంటే జనసేన కచ్చితంగా నేషనల్ పార్టీ అవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ వేదికగా ‘సేనతో సేనాని’ పేరుతో మూడు రోజులపాటు నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
Pawan Kalyan Key Comments
ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ఐదు విషయాలను పవన్ ప్రస్తావించారు. పార్టీని సంస్థాగతంగా నిర్మించేందుకు పార్టీ కార్యాలయం నుంచి మండల స్థాయి వరకు మానిటర్ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు స్థిరత్వం కావాలని… కూటమి సర్కారు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏమైనా తప్పులు చేస్తే ప్రజలు, రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరించారు. మళ్లీ అరాచక పాలన, చీకటి రోజులు వస్తాయని అన్నారు. నాయకులనే వారు కింద నుంచే రావాలని సూచించారు. తాము ప్రజాక్షేమం కోరుకుంటున్నాయని, భయపడేది ఉండదు పోరాటాలే ఉంటాయని అన్నారు. పేరంటాలకు వెళ్లాలి, అదే సమయంలో పోరాటాలు చేయాలని మహిళ కార్యకర్తలకు సూచించారు. వేదికపైన ఉన్న నాయకులకు కార్యకర్తల విలువ తెలియాలనే తాను ఈ సమావేశం పెట్టానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గుర్తు చేశారు. తాను ఎప్పుడూ నిస్వార్థంగానే పని చేసుకుంటూ వెళ్లానని, తన పని సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. అందరూ బాగుండాలనేదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కమ్యూనిజంను నినదించిన రష్యా ప్రజాస్వామ్య దేశంగా మారిందని పవన్ గుర్తు చేశారు. సెక్యూలరిజాన్ని తాము అర్థం చేసుకున్నామని అన్నారు. కమ్యూనిజం, సోషలిజం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు. సినిమాలు చేసి, డ్యాన్సులు చేసేవారికి అవగాహన ఉండదనుకుంటున్నారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
సంపూర్ణ అవగాహనతోనే తాము మాట్లాడామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. గుండెల్లో ఉండే మాటే తూటా కావాలని సూచించారు. చివరగా నిలబడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉంటే వారి వెన్నంటి ఉండి, నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. తనకు దశాబ్దకాలం ఇస్తే నాయకులుగా, దేశనిర్మాణంలో కీలక శక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
విశాఖలో జరిగిన సేనతో (Janasena) సేనాని కార్యక్రమంలోపార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… నాయకుడిని నమ్మి, ఆయన కష్ట సమయంలో అండగా నిలవాలని మూడేళ్ల చంటి బిడ్డతో విశాఖ సముద్ర తీరాన పట్టుదలగా పార్టీ జెండా పట్టుకొని నిలబడిన వీర మహిళ గోవిందమ్మ. ఆమె తెగువ, ఓర్పు మనందరికీ స్ఫూర్తి. అలాంటి ఎన్నో గుండెల సమూహమే జనసేన పార్టీ. అందుకే గోవిందమ్మ లాంటి వీర మహిళతో ‘‘సేనతో సేనాని’’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది కార్యకర్తలందరికీ దక్కిన గౌరవం. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపును ఇచ్చే పార్టీ జనసేన పార్టీ. పోరాటాలు, పట్టుదల, ఉద్యమాలు, ఉద్వేగాల సమ్మేళనం జనసేన పార్టీ.
జనసైనికులు, వీర మహిళల్లో కనిపించే ఈ లక్షణాలే పార్టీని ముందుకు నడిపించే రథ చక్రాలుగా పనిచేస్తాయని అన్నారు. పుష్కరకాల జనసేన (Janasena) ప్రస్థానం ఆది నుంచి ప్రజా పంథాలో, ప్రజలతో మమేకమై సామాన్యుడి అస్త్రంగానే ముందుకు సాగిందన్నారు. ‘‘పరిమిత వనరులతో బ్రిటీషు వారి గుండెల్లో అగ్గిపిడుగులా మారి దడ పుట్టించిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ ఆయన పేరునే పెట్టారు. అల్లూరి స్ఫూర్తిని జనసైనికులు, వీర మహిళలు అందిపుచ్చుకోవాలి. వారి కృషి ఫలితంగానే జనసేన రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా ఉద్భవించింది. ప్రజా పోరాటాన్ని ఓ సమూహంలో నింపి, వారిని సరైన దశలో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
పార్టీ మీద విపరీతమైన అభిమానం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే విపరీతమైన ఇష్టం ఉన్న కొందరు ఈ మధ్యకాలంలో అవగాహన లేకుండా ఆవేశంతో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇది బాధించే అంశం. అందరికీ తగిన గుర్తింపును ఇవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన. 14 నెలల కూటమి పాలనలో పాలనపరమైన అంశాలను తెలుసుకునేందుకు, దానిపై పూర్తిగా దృష్టి సారించేందుకు కాస్త సమయం పట్టింది. దీన్నే చూపుతూ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదు. పాలనలో పట్టు తెచ్చుకోవడం ప్రధానం.
ఏదైనా పథకం లేదా కార్యక్రమం చేయాలన్నా సామాన్యుడి పంథాలో ఆలోచించి ముందుకు వెళ్లడం పవన్ కళ్యాణ్ నైజం. క్షేత్రస్థాయిలో ఆయన చూసిన సమస్యలు, వేదనలు అన్ని గుర్తుంచుకొని పథకాలకు, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. గత వైసీపీ హయాంలో ప్రజలంతా విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి ఘన విజయం ఇచ్చారు. అప్పటి అరాచక, అవినీతి పాలన ప్రజలందరికీ ఇప్పటికే గుర్తే. ఓ అహంకార పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే వైసీపీని ఇంటికి పంపి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ప్రజలు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు వెళ్తూ పని చేస్తుంది.
Also Read : Minister Kandula Durgesh: విశాఖలో హరిత హోటల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
