Pawan Kalyan: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
Pawan Kalyan : రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీనితో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది.
Deputy CM Pawan Kalyan Comments
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాస్కి) కింద రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంక (హేవలాక్ వంతెన, రోడ్‌కం రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతం)ను వినోద కేంద్రంగా మార్చనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు తర్వాత ఏడాదికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధిలో వేగం – పవన్ కల్యాణ్
రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు.
‘‘ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది. ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకం. పర్యటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముంది. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు – గజేంద్ర సింగ్ షెకావత్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) అన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు.
‘‘అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకం. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో పర్యటక అభివృద్ధి వేగవంతమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. దేశంలో పర్యటకుల సందర్శన మరింత పెరిగింది. ప్రపంచంలో పర్యటకుల శాతం వేగంగా పెరిగింది భారత్‌లోనే. టూరిజం అభివృద్ధికి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది.
ఏపీలో (AP) పర్యటక రంగ అభివృద్ధికి సుమారు రూ.450 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశాం. స్వదేశీ దర్శన్, ప్రసాద్, సాస్కి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్(సీబీడీడీ) తదితర స్కీమ్‌ల ద్వారా పర్యటక రంగ అభివృద్ధికి కేంద్రం దోహదం చేస్తోంది. స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా అరకు, బొర్రా గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆధ్యాత్మిక టూరిజానికి బాటలు వేస్తున్నాం. అమరావతి, శ్రీశైలం దేవాలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఆ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అన్నవరం దేవాలయంలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.
అమరావతి, పోలవరం ఇలా అన్నింటికీ కేంద్రం సహకారం – పురందేశ్వరి
డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పామని భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించారని చెప్పారు. వికసిత్ భారత్‌లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగమని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం ఇలా అన్నింటికీ కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పారు. అనేక పర్యటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నట్లు వివరించారు. చారిత్రక ప్రాధాన్యత గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్రం సాయమందిస్తోందని పురందేశ్వరి తెలిపారు.
Also Read : CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ 2047కు టోనీ బ్లెయిర్ ప్రశంస
