Pinnelli Paisachikam: ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ నేతలు !
‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ నేతలు !
Pinnelli Paisachikam: ఏపీ రాజకీయాల్లో హింసాత్మక ఘటనలకు కారణమైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసారు. ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో తెలుగుదేశం పార్టీ రూపొందించిన పుస్తకాన్ని ఆ పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma), బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోయిందని… వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందునే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు.
Pinnelli Paisachikam..
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 నిర్వహించిన పోలింగ్ లో మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు తొమ్మిది చోట్ల ఈవీఎంలను ద్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నారు. పోలింగ్ అనంతరం కూడా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న రెంటచింతలలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… ఈవీఎంలను ద్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల కమీషన్ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు పిన్నెల్లిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయిన పిన్నెల్లి… హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనితో పిన్నెల్లి సోదరులు మాచర్లలో మారణహోమం సృష్టించారంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో పుస్తకం విడుదల చేసారు.
Also Read : Emblem of Telangana: తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధం !